Homeతెలంగాణఎంపీడీఓపై మూకుమ్మడి సెలవుల రాజకీయం!

ఎంపీడీఓపై మూకుమ్మడి సెలవుల రాజకీయం!

  • నిబంధనలు పాటించమంటే నిరసనలా?

  • ఏళ్ల తరబడి ఒకే మండలంలో విధులు.. రాజకీయ పలుకుబడితో అధికారులపై ఒత్తిళ్లు?

  • విచారణ నివేదికలు బుట్టదాఖలు.. బాధ్యులపై చర్యలేవీ?

  • గ్రామాభివృద్ధిని పక్కనపెట్టి ఉద్యోగుల రాజకీయమా?

మర్రిగూడ (క్రైమ్ మిర్రర్): మండలంలో పరిపాలనా నిబంధనలు అమలు చేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగులే, వాటిని ప్రశ్నార్థకం చేసే పరిస్థితి నెలకొంటే గ్రామాభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది? విధి నిర్వహణలో నిబంధనలు పాటించాలని సూచించిన ఎంపీడీఓపై, కొంతమంది పంచాయతీ కార్యదర్శులు మూకుమ్మడిగా సెలవుల లేఖ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అధికారులపై ఆరోపణలు ఉంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలి. విచారణ కోరాలి. తప్పు నిరూపితమైతే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయాలి.! కానీ నిబంధనలు పాటించమని చెప్పిన అధికారిపైనే సమిష్టిగా ఒత్తిడి తీసుకురావడం ఎంతవరకు సమంజసం? ఇది నిరసనా? లేక పరిపాలనపై ఆధిపత్యం చెలాయించే ప్రయత్నమా?

  • నిబంధనలు చెప్పిన అధికారిపై దండయాత్ర ఎందుకు?

ప్రభుత్వ ఉద్యోగుల విధి నిర్వహణలో నిబంధనలు ప్రాథమికమైనవి. పంచాయతీ కార్యదర్శుల బాధ్యతలు గ్రామపంచాయతీ పరిపాలన, ప్రజలకు సేవలు అందించడం, ప్రభుత్వ పథకాల అమలు, రికార్డుల నిర్వహణ, పారిశుద్ధ్యం, పంచాయతీ ఆస్తుల పరిరక్షణ, అధికారిక ధ్రువీకరణల జారీ వంటి అంశాలతో ముడిపడి ఉంటాయి. ఈ బాధ్యతల్లో ఎక్కడైనా నిర్లక్ష్యం జరిగితే సంబంధిత అధికారి ప్రశ్నించడం సహజం. అయితే నిబంధనలు పాటించాలని సూచించిన ఎంపీడీఓపై, కొంతమంది కార్యదర్శులు మూకుమ్మడిగా సెలవులు కోరడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? విధి నిర్వహణలో తప్పులు ఎత్తిచూపినందుకే ఈ నిరసననా? లేక వ్యక్తిగతంగా ఏదైనా సమస్య ఉందా? ఆరోపణలు నిజమైతే విచారణ జరగాలి. అదే సమయంలో అధికారిక బాధ్యతలు గుర్తుచేసినందుకు ఎంపీడీఓను ఒత్తిడికి గురిచేయడం కూడా సమర్థనీయం కాదు.

  • ఏళ్ల తరబడి ఒకే మండలంలో విధులా?

మర్రిగూడ మండలంలో కొంతమంది పంచాయతీ కార్యదర్శులు ఏళ్ల తరబడి ఒకే ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నారనే అంశం కూడా పరిశీలనకు రావాలి.! దీర్ఘకాలం ఒకే చోట పనిచేయడం వల్ల స్థానిక రాజకీయ పరిచయాలు, పలుకుబడి పెరిగే అవకాశాలు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో పరిపాలనా నిర్ణయాలపై ప్రభావం పడుతోందా? నిబంధనల అమలుకు అడ్డంకులు ఏర్పడుతున్నాయా? అన్నది ఉన్నతాధికారులు సమగ్రంగా పరిశీలించాలి. దీర్ఘకాలిక పోస్టింగ్‌లపై ప్రభుత్వ బదిలీ విధానాలు, సంబంధిత మార్గదర్శకాలను పరిశీలించి, సంబందిత కార్యదర్శులను బదిలీ చేయాల్సిన అవసరం ఉందా లేదా అన్నది జిల్లా కలెక్టర్ నిర్ణయించాలి.!? మండలంలోని కొన్ని గ్రామపంచాయతీల్లో కార్యదర్శుల పనితీరుపై గతంలో విచారణలు జరిగినట్లు, నివేదికలు సమర్పించబడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.! విచారణలు పూర్తయినప్పటికీ సంబంధిత నివేదికలపై ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం నిజమైతే, అది అధికార యంత్రాంగం పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. విచారణలో అక్రమాలు నిర్ధారణ అయినా చర్యలు తీసుకోకపోతే నిబంధనలు పాటించే ఉద్యోగులకు ఏ సందేశం వెళుతుంది ఉన్నత అధికారులే చెప్పాలి..!? ఈ నిర్లక్ష్యం వల్ల తప్పు చేసినా రాజకీయ పలుకుబడి ఉంటే రక్షణ లభిస్తుందనే భావన ఏర్పడదా? విచారణ నివేదికలు ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయి? బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో జాప్యానికి కారణాలేమిటి? విచారణ నివేదికలు, సంబంధిత రికార్డులను పరిశీలించి, తప్పు నిర్ధారణ అయిన చోట నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలి. విచారణ జరగని గ్రామాల్లోనూ పారదర్శకంగా విచారణ చేపట్టాలి. రాజకీయ ఒత్తిళ్లతో విచారణలను అడ్డుకునే ప్రయత్నాలు జరిగితే వాటిని కూడా పరిశీలించాలి.

  • ధ్రువీకరణల జారీలో నిబంధనలు ఎక్కడ?

పంచాయతీ కార్యదర్శులు ప్రజలకు జారీ చేసే ధ్రువీకరణలు, అధికారిక పత్రాలు నిబంధనల ప్రకారం ఉండాలి. వాస్తవాలను పరిశీలించకుండా, రికార్డులను ధ్రువీకరించకుండా, నిబంధనలకు విరుద్ధంగా పత్రాలు జారీ చేసినట్లు ఆరోపణలు ఉంటే వాటిని తేలికగా తీసుకోరాదు. ఇప్పటికే విచారణలు పూర్తయిన గ్రామపంచాయతీల్లో, సంబంధిత కార్యదర్శులపై చర్యలు తీసుకోవాలి. విచారణ జరగాల్సిన గ్రామాల్లోనూ ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా విచారణ కొనసాగాలి.! తప్పు చేసిన వారిని కాపాడటం ఎంత తప్పో, తప్పు చేయని వారిని రాజకీయ కక్షతో లక్ష్యంగా చేసుకోవడం కూడా అంతే తప్పు.

  • విచారణలో మాజీ ప్రజాప్రతినిధులు.. ప్రజాప్రతినిధుల భర్తల హాజరు ఎందుకు?

జిల్లా పంచాయతీ అధికారి నిర్వహించే విచారణలకు మాజీ ప్రజాప్రతినిధులను వెంటబెట్టుకొని రావడం, ప్రజాప్రతినిధుల భర్తలు హాజరవుతున్నారనే ఆరోపణలు కూడా పరిశీలనకు రావాలి.! ప్రభుత్వ ఉద్యోగులపై విచారణలు అధికారిక రికార్డులు, వాస్తవాలు, సాక్ష్యాల ఆధారంగా జరగాలి. రాజకీయ వ్యక్తుల హాజరు విచారణపై ప్రభావం చూపుతోందా? ఉద్యోగులపై ఒత్తిడి తెస్తోందా? అన్నది ఉన్నతాధికారులు నిర్ధారించాలి. ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు. అయితే విచారణ ప్రక్రియను రాజకీయ వేదికగా మార్చడం, ఉద్యోగులపై ఒత్తిడి పెంచడం, పరిపాలనా స్వతంత్రతను దెబ్బతీయడం మాత్రం సమర్థనీయం కాదు.

  • ప్రభుత్వ ఉద్యోగుల ప్రెస్‌మీట్.. నిబంధనలు వర్తించవా?

ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న పంచాయతీ కార్యదర్శులు సమిష్టిగా ప్రెస్‌మీట్ నిర్వహించడం, అధికారులపై బహిరంగ విమర్శలు చేయడం వంటి అంశాలపై, సంబంధిత సర్వీస్ కండక్ట్ నిబంధనలు పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఉద్యోగుల సమస్యలను సంఘాల ద్వారా, అధికారిక ఫిర్యాదుల ద్వారా పరిష్కరించుకునే మార్గాలు ఉన్నాయి. కానీ సీసీఏ 1991 నిబంధనల ప్రకారం, ప్రెస్‌మీట్ నిర్వహణ నిబంధనలకు విరుద్ధమనే చెప్పాలి..!? ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన జరిగిందా? అధికారులపై సామూహిక ఒత్తిడి లేదా బెదిరింపులకు పాల్పడ్డారా? అనే అంశాలను సంబంధిత అధికారులు విచారించాలి. ఆరోపణలు నిర్ధారణ అయితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.

  • గ్రామాభివృద్ధిని అడ్డుకునే రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలి

పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగం రాజకీయాలకు వేదిక కాదు. గ్రామ ప్రజలకు సేవ చేయడం, ప్రభుత్వ నిబంధనలను అమలు చేయడం, గ్రామాభివృద్ధికి సహకరించడం వారి ప్రాథమిక బాధ్యత. అధికారుల మధ్య విభేదాలు, రాజకీయ పలుకుబడి, మూకుమ్మడి ఒత్తిళ్ల కారణంగా గ్రామాల్లో పరిపాలన నిలిచిపోతే నష్టపోయేది సామాన్య ప్రజలే. ఎంపీడీఓపై ఆరోపణలు ఉంటే విచారణ జరగాలి. ఆయన తప్పు చేసినట్లు నిర్ధారణ అయితే చర్యలు తీసుకోవాలి. అదే విధంగా నిబంధనలు పాటించకుండా వ్యవహరించిన కార్యదర్శులపై, ఆరోపణలు ఉంటే వాటిపైనా విచారణ జరిపి బాధ్యత నిర్ధారించాలి. అధికారులపై ఆరోపణలు చేయడం ఒకరి హక్కు కావచ్చు. కానీ ఆరోపణల పేరుతో పరిపాలనను అడ్డుకోవడం ఎవరికీ హక్కు కాదు. మర్రిగూడ మండలంలో మూకుమ్మడి సెలవుల వ్యవహారం వెనుక ఉన్న, వాస్తవాలను జిల్లా ఉన్నతాధికారులు వెలికితీయాలి. దీర్ఘకాలిక పోస్టింగ్‌లపై సమీక్ష చేపట్టాలి. పెండింగ్‌లో ఉన్న విచారణ నివేదికలపై నిర్ణయం తీసుకోవాలి. నిబంధనలకు విరుద్ధంగా ధ్రువీకరణలు జారీ చేసినట్లు తేలిన కార్యదర్శులపై చర్యలు తీసుకోవాలి. విచారణ జరగాల్సిన గ్రామాల్లో రాజకీయ జోక్యం లేకుండా విచారణ కొనసాగించాలి. నిబంధనలు పాటించమని చెప్పిన అధికారిపై మూకుమ్మడి ఒత్తిడి తీసుకురావడం సరైన పద్ధతి కాదు. ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యతలను గుర్తుచేయడం తప్పు కాదు. తప్పు చేసిన వారిని ప్రశ్నించడం దండయాత్రకు కారణం కాకూడదు. మర్రిగూడ మండలంలో పరిపాలన రాజకీయ పలుకుబడికి కాకుండా నిబంధనలకు అనుగుణంగా సాగాలి. మూకుమ్మడి సెలవుల లేఖలతో పరిపాలనను ఒత్తిడికి గురిచేయాలనుకుంటున్నారా? విచారణ నివేదికలపై చర్యలు ఎందుకు లేవు? ఏళ్ల తరబడి ఒకే మండలంలో విధులు నిర్వహిస్తున్న కార్యదర్శులపై సమీక్ష ఎప్పుడు? జిల్లా ఉన్నతాధికారులు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు