-
ఆర్టిఫిషియల్ టెక్నాలజీతో ప్రచార హోరు
-
గ్రామీణ, పాత తరం ఓట్లే టార్గెట్
క్రైమ్ మిర్రర్, ఎలక్షన్ డెస్క్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. ప్రచారం పర్వం పతాక స్థాయికి చేరుకుంది. నువ్వా నేనా అన్నట్టు సాగుతోంది. అయితే ఇప్పటికీ తమిళనాడు రాజకీయాల్లో జయలలితతో పాటు కరుణానిధి ప్రభావం తగ్గలేదు. అధికార డిఎంకె, విపక్ష అన్న డీఎంకే ఇప్పటికీ తమ ప్రచారంలో ఆ ఇద్దరి నేతల పేర్లు చెబుతూనే ఉన్నాయి. అయితే ఒక అడుగు ముందుకేసి డిజిటల్ టెక్నాలజీని కూడా వాడుకుంటున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా ఆ ఇద్దరు నేత్రలను ప్రచార పర్వంలోకి దించుతున్నాయి. జయలలితతో పాటు కరుణానిధి గొంతులను ఏఐ టెక్నాలజీతో ఆడియోలుగా తయారుచేసిన రాజకీయ పార్టీలు వాటిని తమ ప్రచారంలో వాడుకుంటున్నాయి. కేవలం సభల్లో వారి వీడియోలు ప్రదర్శించడమే కాదు.. నేరుగా ఓటర్ల మొబైల్ ఫోన్ లకే వారి గొంతులతో కాల్స్ వెళ్లేలా చేస్తున్నాయి.
ఆ ఇద్దరు నేతల ప్రభావం ఎక్కువ
తమిళనాడు రాజకీయాల్లో కరుణానిధితో పాటు జయలలిత ప్రభావం ఎక్కువ. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ఆ ఇద్దరు నేతలను గుర్తించుకుంటారు ప్రజలు. వృద్ధులతోపాటు పాతతరం కార్యకర్తలు తమ అభిమాన నాయకుల గొంతులను ఫోన్లో వినగానే ఆశ్చర్యపోతున్నారు. వణక్కం నేను జయలలితను మాట్లాడుతున్నాను అంటూ ఫోన్లో వినిపిస్తుంటే ఒక్కసారిగా మురిసిపోతున్నారు. అది రికార్డింగ్ అని స్పష్టంగా తెలుస్తున్న భావోద్వేగానికి గురవుతున్నారు. తమ ప్రియతమ నాయకులు మళ్లీ వచ్చి ఓట్లు అడుగుతున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కాల్స్ విన్న తర్వాత కొందరు భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకోవడం కనిపిస్తోంది.
ప్రజానాడిని పట్టుకొని..
సాధారణంగా తమిళనాడులో విపరీతమైన రాజకీయ వ్యామోహం ఉంటుంది. అందుకే ప్రజల నాడిని పట్టుకున్న రాజకీయ పార్టీలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ప్రచారానికి దిగాయి. అధికార డిఎంకె కరుణానిధి గొంతుతో ప్రభుత్వ పథకాలను వివరిస్తుంటే.. ఏఐఏడీఎంకే జయలలిత గొంతుతో పార్టీ ప్రాముఖ్యతను గుర్తుచేస్తోంది. అయితే చనిపోయిన వారిని రాజకీయాల కోసం వాడుకోవడం ఏమిటంటే ప్రశ్న కూడా వినిపిస్తోంది. ఇది ఓటర్లను తప్పుదారి పట్టించడమే అవుతుందని వాదిస్తున్న వారు ఉన్నారు. కానీ అధికార ప్రతిపక్ష పార్టీలు మాత్రం అందులో తప్పేముందని ప్రశ్నిస్తున్నాయి. ప్రస్తుతం తమిళనాడులో హోరాహోరీ పోరు కొనసాగుతోంది. త్రిముఖ పోరు నెలకొంది. అంది వచ్చిన ఏ అవకాశాన్ని రాజకీయ పార్టీలు జారవిడుచుకోవడం లేదు. ఈ ఏఐ ప్రయోగం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం పాత తరం ఓట్లను పరిచయం చేసుకోవడమే. కొత్తగా వచ్చిన నేతలు తమ పూర్వీకుల అడుగుజాడల్లోనే నడుస్తున్నారని నిరూపించుకోవడానికి ఈ డిజిటల్ వారసత్వాన్ని వాడుకుంటున్నారు. గ్లామర్ తో పాటు టెక్నాలజీ రెండు కలిపిన ఈ కొత్త తరహా ప్రచారం తమిళనాడు ఎన్నికలకు దేశంలోనే అత్యంత ఖరీదైన ప్రక్రియగా గుర్తింపు సాధిస్తోంది.
