Homeఆంధ్ర ప్రదేశ్పిఠాపురం వర్మపై వేటు...!

పిఠాపురం వర్మపై వేటు…!

  • టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి పదవి నుంచి తొలగింపు

  • ముగ్గురు నేతలతో కూడిన కమిటీ నియామకం

  • కూటమిలో విభేదాలకు కారణం కావడమే కారణం

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీలో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లా పిఠాపురం టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ వర్మపై వేటు పడింది. ఆయనను పార్టీ ఇన్చార్జి పదవి నుంచి తొలగిస్తూ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. దీంతో వర్మ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. హై కమాండ్ నిర్ణయం పై ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. అధిష్టానం ఆదేశాల మేరకు నడుచుకుంటానని చెప్పుకొచ్చారు. ఈ పరిస్థితుల్లో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కన్నీటి పర్యంతం అవుతూ ప్రెస్ మీట్ నుంచి మధ్యలో లేచి వెళ్లిపోయారు.

మంచి పట్టున్న నేత
పిఠాపురం నియోజకవర్గంలో వర్మ మంచి పట్టు ఉన్న నేత. 2014లో టికెట్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచిన చరిత్ర ఆయనది. 2019లో జగన్ ప్రభంజనంలో ఓడిపోయారు కానీ.. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు సాగారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచిన నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి అన్నంతగా తీర్చిదిద్దారు.

అయితే 2024 ఎన్నికలకు ముందు పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గాన్ని కోరుకున్నారు. అయితే అప్పటికే వర్మ పోటీకి అన్ని విధాల సన్నాహాలు చేసుకున్నారు. పవన్ కోరడంతో వర్మతో పాటు టిడిపి శ్రేణులు అభ్యంతరం తెలిపాయి. అయితే పార్టీ అధినేత చంద్రబాబు సముదాయించారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణం మంచి అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ సైతం వర్మ సాయాన్ని కోరుకున్నారు. వర్మ సైతం మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కృషి చేశారు. భారీ మెజారిటీతో గెలిచిన పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం అయ్యారు.

వర్మ వైఖరిలో మార్పు..
ఎన్నికల ఫలితాలు వచ్చాక వర్మ వైఖరిలో స్పష్టమైన మార్పు వచ్చింది. ఇస్తామన్న ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదు. ఎప్పుడిస్తారో తెలియలేదు. సహజంగానే తీవ్ర అసంతృప్తికి గురైన వర్మ.. పిఠాపురం నియోజకవర్గంలో టిడిపిని కాపాడుకునే ప్రయత్నంలో జనసేనతో ఘర్షణ వైఖరి ప్రారంభించారు. అయితే రాష్ట్రస్థాయిలో కూటమి బలంగా ఉండాలన్న వ్యూహంలో భాగంగా నేరుగా పవన్ నియోజక వర్గం కావడంతో వర్మను ఎప్పటికప్పుడు కట్టడి చేస్తూ వచ్చింది టిడిపి హై కమాండ్. కానీ ఇటీవల ప్రోటోకాల్ పేరుతో తరచూ గొడవ పడుతున్నారు వర్మ.

ఇందులో పార్టీ ప్రయోజనం కంటే వ్యక్తిగత ఇమేజ్ కోసం ఆయన పరితపిస్తున్నారని.. ఆయన తీరుతో కూటమికి ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని హై కమాండ్ కు నివేదికలు వెళ్లాయి. అందుకే రాష్ట్రస్థాయి కార్యవర్గంలో వర్మకు చోటు ఇచ్చారు. నియోజకవర్గ ఇన్చార్జ్ పదవి నుంచి తప్పించారు. పిఠాపురంలో టిడిపి సమన్వయానికి ముగ్గురు నేతలతో కూడిన కమిటీ నియమించడంతో ఆ నియోజకవర్గ విషయంలో టిడిపి అంత సీరియస్ గా లేదని అర్థమవుతోంది.

పవన్ అభ్యంతరం తోనే?
పవన్ కళ్యాణ్ ఆదేశాలతోనే పిఠాపురంలో వర్మను తప్పించారన్న టాక్ ఉంది. అయితే నియోజకవర్గం అయినట్లు మరో ప్రచారం ఉంది. పిఠాపురం నియోజకవర్గంలో వేలి పెట్టకుండా ఉండేందుకు టిడిపి ఇన్చార్జి పదవి నుంచి ఆయనకు పక్కన పెట్టారు. అదే సమయంలో ఎమ్మెల్సీ వంటి పదవిని ఇచ్చి.. ఇక పిఠాపురం జోలికి వెళ్లకూడదు అనే షరతు పెట్టనున్నట్లు సమాచారం. ఇటీవల జనసేన నేతలతో వీధి పోరాటానికి దిగారు వర్మ. అంతకుముందు చంద్రబాబు ఫోటో పేరుతో ప్రోటోకాల్ రగడ చేశారు.

డిప్యూటీ సీఎం పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో టిడిపి హై కమాండ్ కూటమికి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు.. వర్మపై వేటు వేసినట్లు తెలుస్తోంది. అయితే రాబోయే ఎన్నికలకు ముందు వర్మ తీవ్ర నిర్ణయం దిశగా అడుగులు వేసినా ఆశ్చర్యపోనవసరం లేదని పొలిటికల్ పండిట్స్ చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు