ఇంట్లో బల్లుల సమస్య చాలా మందిని తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ముఖ్యంగా వంటగది, గోడలు, తలుపుల మూలలు, కిటికీల వద్ద ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఆహార పదార్థాలపై తిరుగుతుంటాయి. చాలాసార్లు మనకు తెలియకుండానే అవి తాకిన వస్తువులను ఉపయోగించే పరిస్థితి వస్తుంది. దీంతో ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే బల్లులను ఇంటి నుంచి దూరంగా ఉంచేందుకు చాలామంది రసాయన మందులు, స్ప్రేలు వాడుతుంటారు. అయితే వాటి ప్రభావం కొద్ది రోజులకే పరిమితమవుతుండగా, కొన్ని సందర్భాల్లో ఇంట్లో చిన్నపిల్లలు, పెంపుడు జంతువులకు కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో సహజసిద్ధమైన పద్ధతుల్లోనే బల్లులను ఇంటి నుంచి తరిమికొట్టే మార్గాలపై ఇప్పుడు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు.
కొంతమంది పాములను చూసినా అంతగా భయపడకపోవచ్చు కానీ ఇంట్లో గోడలపై బల్లులు కనిపిస్తే మాత్రం వెంటనే వణికిపోతుంటారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో వంటగది ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా సంచరిస్తూ కనిపిస్తాయి. బల్లులను చంపకుండా, వాటికి ఎలాంటి హాని కలగకుండా సహజంగా ఇంటి నుంచి దూరంగా ఉంచేందుకు కొన్ని ప్రత్యేక మొక్కలు ఎంతో ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ మొక్కల నుంచి వెలువడే సహజ వాసనలు బల్లులకు అస్సలు నచ్చవు. దీంతో అవి ఆ ప్రాంతాలకు రావడానికి కూడా ఇష్టపడవు. ఇంట్లో లేదా బాల్కనీల్లో ఈ మొక్కలను పెంచడం ద్వారా బల్లుల సమస్యను చాలావరకు తగ్గించుకోవచ్చని చెబుతున్నారు.
రోజ్‌మెరీ మొక్క బల్లులను సహజంగా దూరం పెట్టడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ మొక్క నుంచి వచ్చే ఘాటైన చెక్క వాసన బల్లులకు అసహనాన్ని కలిగిస్తుంది. అందుకే ఈ మొక్క ఉన్న ప్రదేశాలకు అవి చేరడానికి ఇష్టపడవు. రోజ్‌మెరీ మొక్కను కుండీల్లో సులభంగా పెంచుకోవచ్చు. దీనికి తగినంత సూర్యరశ్మి అవసరం ఉండటంతో కిటికీలు, బాల్కనీలు, ఇంటి ముందు భాగాల్లో ఉంచడం మంచిదని సూచిస్తున్నారు. బల్లులను మాత్రమే కాదు, కొన్ని రకాల కీటకాలను కూడా ఇది దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా వంటలలో కూడా ఈ మొక్క ఆకులను ఉపయోగించుకోవచ్చు.
పుదీనా మొక్క నుంచి వచ్చే ఘాటైన వాసన కూడా బల్లులకు అస్సలు నచ్చదు. అందువల్ల పుదీనా మొక్కలను ఇంట్లో బల్లులు ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో ఉంచితే మంచి ఫలితం కనిపిస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా తలుపుల దగ్గర, వంటగది మూలల్లో, కిటికీల సమీపంలో పుదీనా కుండీలు ఉంచడం వల్ల బల్లులు ఆ ప్రాంతాలకు రావడానికి భయపడతాయి. పుదీనా మొక్క వేగంగా పెరుగుతుంది. మొక్కను అప్పుడప్పుడు కత్తిరించడం వల్ల మరింత ఘాటైన వాసన వెలువడుతుంది. దీంతో బల్లులు ఇంటి నుంచి దూరంగా ఉండే అవకాశం పెరుగుతుంది.
నీలగిరి మొక్క కూడా బల్లులను దూరంగా ఉంచడంలో ఉపయోగకరంగా పనిచేస్తుంది. ఈ మొక్కలో ఉండే సహజ నూనెలు ఘాటైన వాసనను విడుదల చేస్తాయి. ఆ వాసన బల్లులకు మాత్రమే కాకుండా మరికొన్ని కీటకాలకు కూడా అసహనాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఇంటి బయట భాగాల్లో లేదా సూర్యరశ్మి బాగా వచ్చే ప్రదేశాల్లో నీలగిరి మొక్కలను పెంచితే బల్లుల రాక తగ్గుతుందని చెబుతున్నారు. ఈ మొక్కను ఆరోగ్యంగా ఉంచేందుకు సరైన సూర్యరశ్మి, అప్పుడప్పుడు కొమ్మలు కత్తిరించడం అవసరమవుతుంది.
పెన్సిల్ కాక్టస్ మొక్క కూడా బల్లులను సహజంగా దూరం చేసే మొక్కల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ మొక్కకు ఉండే జిగురు, దాని నిర్మాణం బల్లులకు అస్సలు నచ్చవు. అందుకే అవి ఈ మొక్క సమీపానికి రావడానికి ఇష్టపడవు. పెన్సిల్ కాక్టస్ మొక్క తక్కువ నీటితో కూడా బాగా పెరుగుతుంది. ముఖ్యంగా వెచ్చని వాతావరణంలో ఇది వేగంగా పెరుగుతుంది. అయితే ఈ మొక్క నుంచి వచ్చే రసాన్ని నేరుగా తాకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అందుకే దీన్ని ఇంటి లోపల కంటే డాబాలు, తోటలు, బాల్కనీలు వంటి ప్రదేశాల్లో ఉంచడం ఉత్తమమని చెబుతున్నారు. ఈ సహజ చిట్కాలను పాటించడం ద్వారా బల్లులను చంపకుండా ఇంటి నుంచి సులభంగా దూరం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ALSO READ: అమరావతి పిలుస్తోంది…! ప్రపంచ నగరాల్లో ఇదీ ఒకటి….