Homeతెలంగాణబాధితుల పట్ల అమర్యాదగా నడుచుకుంటే ఊరుకోం.. కానిస్టేబుళ్లు, ఎస్సైలకు సజ్జనార్ వార్నింగ్!!

బాధితుల పట్ల అమర్యాదగా నడుచుకుంటే ఊరుకోం.. కానిస్టేబుళ్లు, ఎస్సైలకు సజ్జనార్ వార్నింగ్!!

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : పోలీస్ స్టేషన్లకు వచ్చే బాధితుల పట్ల కొందరు సిబ్బంది ప్రవర్తిస్తున్న తీరుపై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కష్టాల్లో ఉండి, మానసిక వేదనతో ఆసరా కోసం ఆశగా పోలీస్ స్టేషన్ల గడప తొక్కే ప్రజల పట్ల మీరు చూపించే ఔదార్యం ఇదేనా?’ అంటూ అధికారులను నిలదీశారు. బాధితులతో వ్యవహరించే పద్ధతి ఇదేనా? అని మండిపడిన ఆయన.. ఫిర్యాదులు చేసేందుకు వచ్చే వారితో అమర్యాదగా, బాధ్యతారహితంగా ప్రవర్తించే సిబ్బందిపై కఠినమైన శాఖాపరమైన చర్యలకు ఆదేశాలు జారీ చేశారు.

బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఇటీవల నిర్వహించిన ఉన్నత స్థాయి నేర సమీక్షా సమావేశంలో సీపీ సజ్జనార్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమీక్షా సమావేశంలో పోలీస్ స్టేషన్ల పనితీరు, ప్రజా సంబంధాలపై సీపీ సుదీర్ఘంగా చర్చించారు. కొన్ని పోలీస్ స్టేషన్లలో రిసెప్షనిస్టులుగా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్ల ప్రవర్తన అత్యంత ఇబ్బందికరంగా మారుతోందని, ప్రజలకు కనీస గౌరవం ఇవ్వడం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే, పరిపాలనా బాధ్యతలు చూసే అడ్మిన్ ఎస్సైలు చాలా చోట్ల సమయపాలన పాటించడం లేదని తప్పుబట్టారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు హితవు పలికారు.

‘మీ కుటుంబ సభ్యులే ఏదైనా సమస్యపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లినప్పుడు, అక్కడ ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులే ఎదురైతే ఒక కుటుంబంగా మీరెలా భావిస్తారో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి’ అని భావోద్వేగంగా మందలించారు. రిసెప్షనిస్టులు, అడ్మిన్ ఎస్సైల తప్పిదాలపై పర్యవేక్షణ లోపించినందుకు గానూ కొందరు ఇన్‌స్పెక్టర్లకు ఇప్పటికే ఛార్జిమెమోలు జారీ చేసినట్లు పోలీసు వర్గాల ద్వారా సమాచారం అందింది. పోలీస్ స్టేషన్లలో క్షేత్రస్థాయి పరిస్థితులను, సిబ్బంది వ్యవహారశైలిని తెలుసుకునేందుకు సీపీ సజ్జనార్ ఒక వినూత్న వ్యూహాన్ని అమలు చేశారు. ప్రజల నుంచి వస్తున్న వరుస ఫిర్యాదుల నేపథ్యంలో.. ఆయన స్వయంగా పలు పోలీస్ స్టేషన్లలో డెకాయ్ ఆపరేషన్స్ నిర్వహించారు. పోలీసు అధికారులనే సాధారణ బాధితులుగా సివిల్ డ్రెస్‌లో ఫిర్యాదులు ఇచ్చేందుకు వివిధ స్టేషన్లకు పంపించారు.

అక్కడ వారికి ఎదురైన చేదు అనుభవాలను, సిబ్బంది స్పందించిన తీరును నివేదిక రూపంలో సీపీకి సమర్పించారు. ఈ ఆపరేషన్‌లో దాదాపు 12 పోలీస్ స్టేషన్లలో రిసెప్షనిస్టులు, అడ్మిన్ ఎస్సైలు, ఏఎస్సైలు బాధితులతో చాలా ఇబ్బందికరంగా, కఠినంగా మాట్లాడినట్లు తేలింది. ఏదైనా ఫిర్యాదు ఇవ్వడానికి వస్తే సవాలక్ష ప్రశ్నలు వేయడం, అది తమ పరిధిలోకి రాదంటూ పక్క స్టేషన్లకు నెట్టేయడం, అడిగితే సూటిపోటి మాటలతో వేధించడం వంటి దారుణాలు వెలుగుచూశాయి. అంతేకాకుండా, ఫిర్యాదులను వెంటనే స్వీకరించకుండా రేపు రా.. మాపు రా.. అంటూ రోజులు తరబడి వాయిదాలు వేసి బాధితులను వెనక్కి పంపిన ఉదంతాలు ఈ రహస్య తనిఖీల్లో బయటపడ్డాయి. ఇకపై ప్రజా సమస్యల పట్ల అలసత్వం వహిస్తే సస్పెన్షన్లు, బదిలీలు తప్పవని సీపీ సజ్జనార్ హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు