క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : కేంద్ర కేబినెట్ ప్రక్షాళన (Union Cabinet Reshuffle) పై గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం నిజమేనని తేలిపోయింది. కేంద్ర కేబినెట్లో మార్పులు చేర్పులకు ప్రధాని మోడీ రంగం సిద్దం చేస్తున్నారు. ఇందులో భాగంగా కొత్తగా కేబినెట్లో చేరే మంత్రులు, అలాగే చోటు కోల్పోయే మంత్రుల వివరాలను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు పంపారు. ఇవాళ హోంమంత్రి అమిత్ షా ఈ జాబితాను ప్రధాని మోడీకి తీసుకెళ్లి అందించినట్లు తెలుస్తోంది. అలాగే కేబినెట్ ప్రక్షాళన తేదీని కూడా ఖరారు చేసినట్లు సమాచారం. ప్రధాని మోదీ రాష్ట్రపతిని కలిసిన రెండు రోజుల తర్వాత అమిత్ షా సమావేశం జరిగింది.
బీజేపీ కొందరు మంత్రులను రాజ్యసభకు తిరిగి నామినేట్ చేయకపోవడం, మరికొందరికి వారి రాష్ట్రాల్లో కీలకమైన సంస్థాగత బాధ్యతలు అప్పగించడం వంటి పరిణామాల నేపథ్యంలో కేబినెట్ ప్రక్షాళన తప్పదని తేలిపోయింది. ఇప్పుడు రాష్ట్రపతిని వరుసగా ప్రధాని మోడీ, అమిత్ షా కలవడంతో ఈ ఊహాగానాలు నిజమవుతున్నాయి. అమిత్ షాతో భేటీకి సంబంధించిన ఫొటోను రాష్ట్రపతి భవన్ ట్వీట్ చేసింది. కేరళకు చెందిన సీనియర్ బీజేపీ నేత జార్జ్ కురియన్, తన రాజ్యసభ పదవీకాలం ముగిసిన నేపథ్యంలో తాజాగా మంత్రిమండలి బాధ్యతల నుంచి తప్పుకున్నారు.
65 ఏళ్ల కురియన్ మైనారిటీ వ్యవహారాల శాఖతో పాటు మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖల సహాయ మంత్రిగా వ్యవహరించారు. జూన్ 21తో ఎగువ సభ (రాజ్యసభ)లో పదవీకాలం ముగిసిన కురియన్‌ను తిరిగి నామినేట్ చేయకూడదని బీజేపీ నిర్ణయించింది. అలాగే జూన్ 21తో రాజ్యసభ పదవీకాలం ముగిసిన రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్‌నీత్ సింగ్‌ను కూడా బీజేపీ ఎగువ సభకు తిరిగి నామినేట్ చేయలేదు. ఆగస్టు 2024 నుండి రాజస్థాన్ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సింగ్, ప్రస్తుతం ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.