క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : మన దేశంలో పౌరసత్వ గుర్తింపు కోసం ఇప్పటివరకూ సేఫ్ గా భావించిన పాస్ పోర్టును సైతం కేంద్రం కేవలం ట్రావెల్ డాక్యుమెంట్ మాత్రమేనని, పౌరసత్వ గుర్తింపు ధృవీకరణ కాదని తేల్చేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. కేంద్రం నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఆధార్, ఓటర్ కార్డు, పాన్ కార్డు వంటి డాక్యుమెంట్లను పౌరసత్వానికి గుర్తింపులు కాదని పక్కనబెట్టేసిన కేంద్రం.. ఇప్పుడు పాస్ పోర్టును సైతం ఇలా తేల్చేయడంపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అయ్యారు. పాస్ పోర్టు కూడా పౌరసత్వం రుజువుగా చెల్లదంటూ కేంద్రం చేసిన ట్వీట్ పై అసదుద్దీన్ ఓవైసీ సెటైర్లు వేశారు. ప్రభుత్వం ప్రకారం, ఏ పత్రమూ పౌరసత్వానికి తిరుగులేని రుజువు కాదని ఓవైసీ తెలిపారు. అలాగే 2030 నాటికి, పౌరసత్వానికి ఒకే ఒక్క పత్రం రుజువుగా ఉంటుంది అంటూ బీజేపీ సభ్యత్వ గుర్తింపు కార్డు ఫొటోను ఆయన ట్వీట్ చేశారు. దీన్ని బట్టి బీజేపీ గుర్తింపు కార్డు తప్ప ఇతర ఏ కార్డు కూడా పౌరసత్వానికి రుజువుగా పనికి రాదని ఓవైసీ తేల్చిచెప్పేశారు. ఇప్పటికే కేంద్రం ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ సందర్భంగా ఆధార్ కార్డు పౌరసత్వానికి గుర్తింపు కాదని పలు సందర్భాల్లో తేల్చేసింది. దీనికి సుప్రీంకోర్టు కూడా ఆమోద ముద్ర వేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు పాస్ పోర్టును సైతం గుర్తింపు కార్డుగా అంగీకరించకపోతే ఇక ఏ కార్డు గుర్తింపుగా పనికొస్తుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనిపై కేంద్రం ఇప్పటివరకూ ఎలాంటి వివరణ ఇవ్వకపోవడంతో అనుమానాలు పెరుగుతున్నాయి. కోట్ల మంది జనాభా ఉన్న దేశంలో పౌరసత్వ గుర్తింపు విషయంలో కేంద్రం ఎదుర్కొంటున్న ఇబ్బందులకు తాజా పరిణామాలు అద్దం పట్టేలా ఉన్నాయన్న చర్చ జరుగుతోంది.
పౌరసత్వం కోసం అదొక్కటి చాలు..!.. కేంద్రం నిర్ణయంపై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఫైర్!!
By Crime Mirror
0
18