తెలంగాణలో నైరుతీ రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఇప్పటివరకు దక్షిణ తెలంగాణ నుంచి మధ్య తెలంగాణ వరకు విస్తరించిన ఈ రుతుపవనాలు, ఇవాళ హైదరాబాద్ ప్రాంతాన్ని చేరుకునే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీంతో హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం చల్లబడనుంది. రాబోయే రోజుల్లో వర్షాల ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం జూన్ 14 నుంచి 19 వరకు తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంతేకాకుండా జూన్ 14 నుంచి 17 వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని, గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
నైరుతీ రుతుపవనాలు ఇవాళ దాదాపు 95 శాతం వరకు ఆంధ్రప్రదేశ్‌లో విస్తరించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఉత్తరాంధ్రలో మిగిలిన శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల్లో కూడా ఇవి ప్రవేశించనున్నాయి. మరోవైపు తెలంగాణలో ఇప్పటికే దక్షిణ, మధ్య ప్రాంతాలను కవర్ చేసిన రుతుపవనాలు, ఇవాళ హైదరాబాద్‌కు చేరుకుంటాయని, తద్వారా వేడిగాలుల ప్రభావం తగ్గుతుందని భావిస్తున్నారు. రాబోయే మూడు నుంచి నాలుగు రోజుల్లో ఉత్తర తెలంగాణ మొత్తానికి ఈ రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉంది.
తెలంగాణపై ప్రస్తుతం ఒక ఉపరితల ఆవర్తనం ప్రభావం చూపుతోంది. దీని కారణంగా సముద్ర మట్టం నుంచి సుమారు 5.8 కిలోమీటర్ల ఎత్తువరకు మేఘాలు ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. శాటిలైట్ డేటా ప్రకారం ఇవాళ తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఉదయం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సాయంత్రం సమయంలో పలుచోట్ల జల్లులు పడవచ్చని అంచనా. హైదరాబాద్‌లో రోజంతా మేఘావృత వాతావరణం ఉండే అవకాశం ఉన్నప్పటికీ భారీ వర్షాలు తక్కువగా ఉండవచ్చని భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇవాళ వాతావరణం మార్పులు కనిపించనున్నాయి. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ఉత్తర భాగాల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సాయంత్రం వేళల్లో అక్కడక్కడా జల్లులు పడవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో కూడా చల్లని గాలులతో వాతావరణం ఆహ్లాదకరంగా మారనుంది. ఉష్ణోగ్రతలు తగ్గి ప్రజలకు ఉపశమనం కలగనుంది.
ఈదురు గాలుల వేగం కూడా గణనీయంగా ఉండనుంది. అరేబియా సముద్రంలో గంటకు 65 కిలోమీటర్ల వేగంతో రుతుపవనాలు కదులుతున్నాయని సమాచారం. తెలంగాణలో గంటకు సుమారు 30 కిలోమీటర్ల వేగంతో, ఆంధ్రప్రదేశ్‌లో 30 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అంచనా. బంగాళాఖాతంలో కూడా గాలుల వేగం ఎక్కువగా ఉండటంతో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఉష్ణోగ్రతల విషయానికి వస్తే ఏపీలో గరిష్టంగా 38 డిగ్రీల సెల్సియస్ వరకు, తెలంగాణలో 39 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉంది. తేమ శాతం కూడా పెరుగుతున్న నేపథ్యంలో వాతావరణంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా.
మరోవైపు పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడనాలు బలహీనపడటం భారత్‌కు అనుకూలంగా మారిందని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల ఎల్ నినో ప్రభావం తగ్గి, వర్షపాతం పెరిగే అవకాశం ఉందని అంచనా. అలాగే హిందూ మహాసముద్రం, అంటార్కిటికా ప్రాంతాల వాతావరణ పరిస్థితులు కూడా నైరుతీ రుతుపవనాలకు అనుకూలంగా మారుతున్నాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు.
మొత్తంగా చూస్తే జూన్ నెల మొత్తం పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నాయని అంచనా వేస్తున్నారు. రైతులు ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని సూచిస్తున్నారు.
ALSO READ: ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా ఆభా అకౌంట్..