ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి నగరంలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పి.జి.ఆర్ లాడ్జిలో 30 ఏళ్ల మహిళ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందిన ఘటన కలకలం రేపుతోంది.
పోలీసుల సమాచారం ప్రకారం, రాజస్థాన్‌కు చెందిన ధనరాజ్, అతని భార్య జీవనోపాధి కోసం ప్లాస్టిక్ వస్తువులు విక్రయిస్తూ తిరుగుతూ జీవనం సాగిస్తున్నారు. ఈ నెల 21వ తేదీన ఈ దంపతులు తిరుపతికి వచ్చి లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నారు. అనంతరం జూలై 27న సాయంత్రం మళ్లీ లాడ్జికి చేరుకున్నారు.
అయితే, జూలై 28 ఉదయం ధనరాజ్ ఒక్కడే గది నుంచి బయటకు వెళ్లడం లాడ్జి సిబ్బందికి అనుమానం కలిగించింది. మంగళవారం రాత్రి అద్దె విషయమై సిబ్బంది గది వద్దకు వెళ్లగా, అక్కడి నుంచి దుర్వాసన రావడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గది తలుపులు తెరిచి పరిశీలించగా, మహిళ మృతదేహం కనుగొన్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, భర్త ధనరాజ్ పాత్రపై పోలీసులు అనుమానంతో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపగా, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
also read: పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేపై కారుకు మంటలు!- తప్పిన భారీ ప్రమాదం
