-
రుణ పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంపు
-
తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్. వారికి ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు అందిస్తున్న వడ్డీ లేని రుణ పరిమితిని రెట్టింపు చేసింది. ఇప్పటివరకు అందిస్తున్న ఐదు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయలకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని తెలంగాణ మంత్రి సీతక్క స్వయంగా వెల్లడించారు. సభ్యులు తీసుకున్న రుణానికి సంబంధించిన వడ్డీ ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లిస్తుందని తేల్చి చెప్పారు. కేవలం ఈ వడ్డీ చెల్లింపులకు గాను రాష్ట్ర ప్రభుత్వం 2500 కోట్ల రూపాయలు ప్రతి ఏటా ఖర్చు చేస్తున్న విషయాన్ని కూడా గుర్తు చేశారు మంత్రి సీతక్క. నిజంగా ఇది మహిళా సంఘాల సభ్యులకు శుభవార్తే.
కోటి మందికి పైగా సభ్యులకు ప్రయోజనం…
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కోటి మందికి పైగా స్వయం సహాయక సంఘాల్లో సభ్యులు ఉంటారు. అయితే వారిని తమ కాళ్లపై తాము నిలబడడమే కాకుండా.. వారి కుటుంబాల్లో కూడా ఆర్థిక వెలుగులు నింపేందుకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. ఇప్పటివరకు డ్వాక్రా సంఘాల సభ్యుల రుణపరిమితి గరిష్టంగా ఐదు లక్షల రూపాయల వరకు ఉండేది. కానీ దానిని రేవంత్ సర్కార్ పది లక్షల రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2026- 27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బ్యాంకు రుణ ప్రణాళికను ఆవిష్కరించే క్రమంలో ఈ విషయాన్ని వెల్లడించారు మంత్రి సీతక్క.
వచ్చిన విన్నపాలతోనే…
సాధారణంగా డ్వాక్రా సంఘాల సభ్యులకు తక్కువ వడ్డీతో రుణాలను అందిస్తూ వస్తుంటారు. సభ్యులు రుణ వాయిదాల పద్ధతిలో చెల్లిస్తుంటారు. అయితే ప్రస్తుతం కుటుంబ అవసరాలు పెరిగాయి. ఆపై చాలామంది మహిళలు స్వయం ఉపాధి మార్గాలపై దృష్టి పెట్టారు. అందుకుగాను కొంత మొత్తం పెట్టుబడి పెంచాలని కోరుతూ వచ్చారు. ఈ పరిస్థితుల్లోనే తెలంగాణ సర్కార్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే వడ్డీ విషయంలో ప్రభుత్వం చెల్లించేందుకు ముందుకు రావడానికి డ్వాక్రా సంఘాల సభ్యులు ఆహ్వానిస్తున్నారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.