HomeతెలంగాణInter Board: ఇంటర్ బోర్డు రద్దు... తెలంగాణ ప్రభుత్వ సంచలన నిర్ణయం ...

Inter Board: ఇంటర్ బోర్డు రద్దు… తెలంగాణ ప్రభుత్వ సంచలన నిర్ణయం …

  • ఇకనుంచి 11, 12 తరగతులు పాఠశాల విద్యాశాఖలో విలీనం

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. విద్య శాఖలో కీలక సంస్కరణల దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా ఇంటర్ బోర్డు రద్దు చేయాలని దాదాపు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇంటర్ను ఇకనుంచి పాఠశాల విద్యాశాఖలో విలీనం చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమైనట్లు సమాచారం. విద్యాశాఖ నిపుణులతో చర్చించిన తరువాత ఈ నిర్ణయానికి వచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ నిర్ణయం పై అనేక రకాల అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దూకుడుగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

నేరుగా సీఎం నిర్ణయం…

సాధారణంగా ఇంటర్ అంటే 11, 12 తరగతులు. దీనికి గాను ఇంటర్ బోర్డు స్వతంత్రంగా పర్యవేక్షిస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు పాఠశాల విద్యాశాఖలో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం విశేషం. ప్రస్తుతం తెలంగాణలో విద్యాశాఖ మంత్రి అంటూ ప్రత్యేకంగా లేరు. సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ బాధ్యతలను చూస్తున్నారు. ఆయన ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. విద్య కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి నేతృత్వంలో బృందం ఈ ప్రతిపాదనలు చేయగా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే అధికారికంగా ఈ నిర్ణయాన్ని ఇంతవరకు ప్రకటించలేదు. కానీ అందుకు సంబంధించిన కసరత్తు మాత్రం మొదలైనట్లు తెలుస్తోంది. అయితే ఇంటర్ బోర్డు రద్దు చేస్తారన్న విషయం అదే బోర్డు అధికారులకు తెలియక పోవడం మాత్రం విశేషం.

అడ్మిషన్ల ప్రక్రియ వాయిదా…

ఇంటర్ బోర్డు రద్దు ప్రతిపాదనలు ఉన్న నేపథ్యంలోనే అడ్మిషన్ల ప్రక్రియను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈనెల 8 నుంచి ఇంటర్ అడ్మిషన్లు ప్రారంభం కావాలి. అయితే వాయిదా వేస్తూ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇంటర్ బోర్డు రద్దు అయితే ఇకనుంచి 11, 12 తరగతులు సైతం పాఠశాల విద్యా శాఖలో విలీనం అవుతాయి. 2026- 27 విద్యా సంవత్సరం ప్రారంభానికి ఇంకా 25 రోజులు మాత్రమే గడువు ఉంది. అయితే అటు ఇంటర్ బోర్డు, ఇటు పాఠశాల విద్యాశాఖలో వేరువేరు చట్టాలు అమల్లో ఉన్నాయి.

వాటికి సవరించేందుకు ఆర్డినెన్స్ జారీ చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేసిన నేపథ్యంలో ఈ ఆర్డినెన్స్ జారీకి అవకాశం ఉంది. ప్రతి రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్ ఒక్కటే బోర్డులో ఉండాలని కేంద్ర ప్రభుత్వం గతంలో సూచనలు చేసింది. ఇదే అమలయితే ప్రభుత్వ జూనియర్ కాలేజీలు సైతం పాఠశాల విద్యా శాఖ పరిధిలోకి వెళ్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు