Homeతెలంగాణదసరా ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. 7 వేల ప్రత్యేక బస్సులు, కొత్త సదుపాయం

దసరా ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. 7 వేల ప్రత్యేక బస్సులు, కొత్త సదుపాయం

దసరా పండుగ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. పండుగ సందర్భంగా పెరగనున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7,000 ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రయాణికులు సురక్షితంగా, సౌకర్యవంతంగా తమ గమ్యస్థానాలకు చేరుకునేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు.

టీజీఎస్ఆర్టీసీ వివరాల ప్రకారం.. కరీంనగర్ జోన్ పరిధిలో అత్యధికంగా 3,533 ప్రత్యేక బస్సులను నడపనున్నారు. ఇందులో ఆదిలాబాద్‌కు 431, నిజామాబాద్‌కు 719, కరీంనగర్‌కు 1,175, వరంగల్‌కు 530, ఖమ్మం ప్రాంతానికి 678 బస్సులను కేటాయించారు.

అదేవిధంగా హైదరాబాద్ జోన్ పరిధిలో 2,155 ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయి. వీటిలో మహబూబ్‌నగర్‌కు 645, మెదక్‌కు 255, నల్గొండకు 815, రంగారెడ్డికి 440 బస్సులను ఏర్పాటు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో మరో 1,312 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు సంస్థ వెల్లడించింది.

ఈ తేదీల్లో భారీ రద్దీ

దసరా పండుగకు ముందు అక్టోబర్ 9, 10 తేదీల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే పండుగ అనంతరం అక్టోబర్ 16, 17 తేదీల్లోనూ స్వగ్రామాల నుంచి తిరుగు ప్రయాణాలు పెరగనున్నాయి. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆయా తేదీల్లో అదనపు బస్సులను నడిపేందుకు టీజీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. తిరుగు ప్రయాణికుల కోసం అక్టోబర్ 25, 26 తేదీల్లోనూ ప్రత్యేక సర్వీసులను సిద్ధం చేస్తున్నారు.

ప్రయాణికుల కోసం కొత్త సదుపాయం

ఈసారి ప్రయాణికుల సౌకర్యం కోసం టీజీఎస్ఆర్టీసీ మరో ప్రత్యేక అవకాశాన్ని కల్పిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కాలనీలు, టౌన్‌షిప్‌లు, గేటెడ్ కమ్యూనిటీలు, హాస్టళ్లు, కళాశాలల్లోని కనీసం 30 మంది ప్రయాణికులు ఒక బృందంగా ఏర్పడి ముందుగానే బుక్ చేసుకుంటే.. వారి వద్దకే ప్రత్యేక బస్సును పంపించే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

అంటే ఒకే ప్రాంతానికి చెందిన ప్రయాణికులు సమూహంగా ముందస్తు రిజర్వేషన్ చేసుకుంటే, వారు సులభంగా బస్సును ఎక్కేలా పికప్ సౌకర్యం కల్పించనున్నారు. దీంతో పండుగ సమయంలో బస్టాండ్ల వద్ద రద్దీని కొంతవరకు తగ్గించడంతో పాటు ప్రయాణికులకు మరింత సౌకర్యం కల్పించవచ్చని సంస్థ భావిస్తోంది.

ఈ ప్రత్యేక బస్సు సర్వీసులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు టికెట్ ధరలను సవరించినట్లు టీజీఎస్ఆర్టీసీ అధికారులు తెలిపారు. పండుగ సమయంలో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా అదనపు సర్వీసులను అందుబాటులో ఉంచేందుకు సంస్థ చర్యలు చేపట్టింది.

also read: బాలయ్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. గాయం నుంచి కోలుకుని మళ్లీ సెట్స్‌లోకి నటసింహం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు