Homeతెలంగాణడ్రిల్లింగ్ మెషీన్‌తో పని చేస్తుండగా ఘోర ప్రమాదం.. 10 గంటల శస్త్రచికిత్సతో యువకుడి చేతికి పునర్జీవం

డ్రిల్లింగ్ మెషీన్‌తో పని చేస్తుండగా ఘోర ప్రమాదం.. 10 గంటల శస్త్రచికిత్సతో యువకుడి చేతికి పునర్జీవం

డ్రిల్లింగ్ మెషీన్‌తో పనిచేస్తుండగా కుడి ముంజేయి పూర్తిగా తెగిపోవడంతో తీవ్రంగా గాయపడిన 19 ఏళ్ల యువకుడికి హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే ఆస్పత్రికి చేరుకోవడంతో వైద్యులు అత్యవసర చికిత్సను ప్రారంభించారు.

సమాచారం ప్రకారం.. మంగళవారం డ్రిల్లింగ్ మెషీన్‌తో పని చేస్తున్న సమయంలో యువకుడి కుడి ముంజేయి పూర్తిగా తెగిపోయింది. ప్రమాదం జరిగిన గంటలోపే అతడిని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితిని అంచనా వేసిన వైద్యులు వెంటనే ప్రత్యేక శస్త్రచికిత్సకు సిద్ధమయ్యారు.

దాదాపు 10 గంటలపాటు కొనసాగిన ఆపరేషన్‌లో తెగిపోయిన చేతిని తిరిగి అతికించేందుకు వైద్య బృందం క్లిష్టమైన శస్త్రచికిత్స చేపట్టింది. రక్తనాళాలు, నరాలు తదితర భాగాలను జాగ్రత్తగా అనుసంధానించి చేతికి మళ్లీ రక్తప్రసరణను పునరుద్ధరించారు. అనంతరం చేతిలో స్పర్శ కూడా తిరిగి వచ్చేలా చికిత్స అందించారు.

ప్రస్తుతం యువకుడి చేతి పరిస్థితిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. ఇలాంటి ప్రమాదాల్లో తెగిపోయిన అవయవాన్ని ఆస్పత్రికి తీసుకురావడంలో కుటుంబ సభ్యులు, సహాయకులు తీసుకునే జాగ్రత్తలు అత్యంత కీలకమని వైద్యులు చెబుతున్నారు.

తెగిపోయిన అవయవాన్ని ఎలా భద్రపరచాలి?

ప్రమాదంలో శరీర భాగం పూర్తిగా తెగిపోతే దానిని శుభ్రమైన సీల్డ్ ప్లాస్టిక్ బ్యాగ్‌లో ఉంచి చల్లగా ఉంచాలి. అయితే అవయవాన్ని నేరుగా ఐస్ గడ్డలపై పెట్టకూడదని వైద్యులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల అవయవ కణజాలం దెబ్బతినే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత త్వరగా బాధితుడిని, తెగిపోయిన అవయవాన్ని కలిపి అత్యవసర వైద్య సదుపాయం ఉన్న ఆస్పత్రికి తరలించడం చాలా ముఖ్యం.

also read: గుడ్‌న్యూస్: తెలంగాణ ఉద్యోగుల ఖాతాల్లో డీఏ డబ్బులు…!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు