సొంత ఇల్లు లేని పేదలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని 2029 వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా సొంత ఇల్లు లేని అర్హులైన పేదలకు ఇంటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనుంది. దీంతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ స్థాయిలో అదనపు సాయం అందిస్తూ గృహ నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు సొంత ఇల్లు కల సాకారం చేసుకునే అవకాశం లభిస్తోంది.
ఈ పథకానికి అర్హతలు ఏమిటి, ఎలా లబ్ధి పొందాలి, దరఖాస్తు విధానం ఎలా ఉంటుందనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రధానంగా లబ్ధిదారుడికి సొంత ఇల్లు ఉండకూడదు. అలాగే రేషన్ కార్డు కలిగి ఉండాలి. దరఖాస్తుదారుడు తక్కువ ఆదాయ వర్గానికి చెందినవారై ఉండాలి. అదనంగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాన్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, చిరునామా రుజువు, ఆదాయ ధృవీకరణ పత్రం వంటి పత్రాలు తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది.
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే విధానం కూడా సులభంగా ఉంటుంది. అధికారిక వెబ్సైట్ అయిన pmaymis.gov.inను సందర్శించాలి. హోమ్ పేజీలో ఉన్న సిటిజన్ అసెస్మెంట్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి అప్లై ఆన్లైన్ ఎంపికను ఎంచుకోవాలి. అనంతరం ఆధార్ నెంబర్, పేరు నమోదు చేసి చెక్ లేదా వెరిఫై ఆప్షన్ను క్లిక్ చేయాలి. తరువాత దరఖాస్తు ఫారం తెరుచుకుంటుంది. ఇందులో రాష్ట్రం, జిల్లా, కుటుంబ పెద్ద పేరు, చిరునామా, మొబైల్ నెంబర్, వార్షిక ఆదాయం, బ్యాంక్ ఖాతా వివరాలు వంటి సమాచారాన్ని జాగ్రత్తగా నమోదు చేయాలి.
అన్ని వివరాలు నమోదు చేసిన తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ నొక్కితే అప్లికేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది. భవిష్యత్తులో దరఖాస్తు స్థితిని తెలుసుకోవడానికి ఈ నెంబర్ను భద్రంగా ఉంచుకోవాలి.
దరఖాస్తు సమర్పించిన తర్వాత అధికారులు అన్ని వివరాలను పరిశీలిస్తారు. అర్హత ఉన్నట్లయితే లబ్ధిదారుడిని ప్రధానమంత్రి ఆవాస్ యోజన జాబితాలో చేర్చుతారు. అనంతరం ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆర్థిక సహాయం నేరుగా లబ్ధిదారుడి బ్యాంక్ ఖాతాలో జమ చేయబడుతుంది. కొన్ని రాష్ట్రాలు కేంద్ర పథకంతో పాటు అదనపు సహాయం కూడా అందిస్తున్నాయి. తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలవుతుండగా, ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రత్యేక గృహ నిర్మాణ పథకాలు కొనసాగుతున్నాయి.
ALSO READ: ఓటీటీని ఊపేస్తోన్న మరో క్రైమ్ థ్రిల్లర్.. పిల్లలతో చూడొద్దు