దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా రాజధాని ఢిల్లీలో కురిసిన భారీ వర్షాలతో నగర జీవనం అస్తవ్యస్తమైంది. రోడ్లు, కాలనీలు మాత్రమే కాకుండా మెట్రో స్టేషన్లు కూడా నీటమునిగిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజాగా వైరల్ అవుతున్న ఒక వీడియోలో జనక్‌పురి మెట్రో స్టేషన్ పరిస్థితి ఆందోళన కలిగించేలా కనిపిస్తోంది. స్టేషన్ బయట ఎగ్జిట్ గేట్ల వద్ద నీరు నిలిచిపోవడంతో పాటు, లోపలికి కూడా వరదనీరు చేరినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మెట్ల ద్వారా కిందికి దిగుతున్న ప్రాంతాల్లో కూడా నీరు చేరడంతో ప్రయాణీకులు జాగ్రత్తగా నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నీటి మట్టం ఎక్కువగా లేకపోయినా, బయటకు వెళ్లాలంటే తప్పనిసరిగా నీటిలో నడవాల్సిందే.
ఇదిలా ఉంటే, ఢిల్లీలోని ప్రధాన ప్రాంతాలైన కన్నాట్ ప్లేస్, ఐటీవో వంటి ప్రాంతాల్లో కూడా రోడ్లు పూర్తిగా జలమయమయ్యాయి. కొన్ని డీటీసీ బస్సుల్లోకే నీరు చేరడంతో ప్రయాణీకులు సీట్లపై కాళ్లు పెట్టుకుని కూర్చోవాల్సి వచ్చిన పరిస్థితులు ఎదురయ్యాయి.
ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు “ఇది మెట్రో స్టేషన్ కాదు.. వాటర్ పార్క్‌లా ఉంది” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తుండగా, మరికొందరు “ఇక పడవలు తీసుకురావాల్సిందే” అంటూ కామెంట్లు చేస్తున్నారు. నగర డ్రైనేజీ వ్యవస్థపై కూడా పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.
ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నప్పటికీ, స్థిరమైన పరిష్కారం కనిపించకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నగర మౌలిక వసతుల అభివృద్ధిపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
also read: సినిమాల కోసం కుటుంబంతోనే పోరాటం చేశా: హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే భావోద్వేగ వ్యాఖ్యలు
