Homeక్రైమ్అమీషా పటేల్ తల్లి ఇంట్లో భారీ చోరీ.. రూ.5 లక్షల నగలు మాయం, పనిమనిషి అరెస్ట్

అమీషా పటేల్ తల్లి ఇంట్లో భారీ చోరీ.. రూ.5 లక్షల నగలు మాయం, పనిమనిషి అరెస్ట్

బాలీవుడ్ నటి అమీషా పటేల్ కుటుంబంలో చోరీ ఘటన కలకలం రేపింది. ముంబైలోని ఆమె తల్లిదండ్రుల నివాసంలో సుమారు రూ.5 లక్షల విలువైన బంగారం, వజ్రాభరణాలు కనిపించకుండా పోయాయి. ఈ వ్యవహారంపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి.. ఇంట్లో పనిచేస్తున్న సీమా ఘాటే (40) అనే మహిళను అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలిని కోర్టులో హాజరుపరచగా.. సెప్టెంబర్ 15 వరకు పోలీస్ కస్టడీకి అనుమతించింది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అమీషా పటేల్ తల్లి ఆశా పటేల్ నివాసంలో సీమా ఘాటే గత ఏడాదిన్నరగా పనిమనిషిగా పనిచేస్తోంది. ఈ ఏడాది జనవరిలో ఇంట్లోని బంగారు గాజు ఒకటి కనిపించకుండా పోవడంతో ఆశా పటేల్‌కు సీమాపై అనుమానం వచ్చింది. అప్పటి నుంచి పలుమార్లు ఆమెను ప్రశ్నించినప్పటికీ.. చోరీ చేసినట్లు సీమా అంగీకరించలేదని పోలీసులు తెలిపారు.

సుమారు ఐదారు నెలల పాటు నగలు తిరిగి ఇవ్వాలని, జరిగిన విషయాన్ని నిజాయితీగా చెప్పాలని ఆశా పటేల్ కోరినప్పటికీ ఫలితం లేకపోవడంతో చివరకు ఆమె మెరైన్ డ్రైవ్ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ 306 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

దర్యాప్తులో భాగంగా సాంకేతిక ఆధారాలను పరిశీలించిన పోలీసులు.. నిందితురాలు విరార్‌లో ఉన్నట్లు గుర్తించి అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆమెను పోలీస్ కస్టడీలో విచారిస్తున్నారు. చోరీకి గురైన బంగారు గాజును స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మిగిలిన ఆభరణాల ఆచూకీ కోసం కూడా దర్యాప్తు కొనసాగుతోంది. నిందితురాలికి గతంలో ఇలాంటి నేరాలకు పాల్పడిన చరిత్ర ఉందా? అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు చోరీకి గురైన మొత్తం ఆభరణాలు పోలీసులకు లభ్యం కాలేదని అధికారులు తెలిపారు.

ఇక అమీషా పటేల్ సినీ కెరీర్ విషయానికి వస్తే.. 2000లో హృతిక్ రోషన్‌తో కలిసి నటించిన ‘కహో నా ప్యార్ హై’ సినిమాతో ఆమె హీరోయిన్‌గా పరిచయమయ్యారు. తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ఆ తర్వాత ‘గదర్: ఏక్ ప్రేమ్ కథ’, ‘హమ్‌రాజ్’, ‘భూల్ భులయ్యా’ తదితర చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు.

ఇటీవల ‘గదర్ 2’ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్న అమీషా పటేల్.. తన కెరీర్‌లో విజయవంతమైన పునరాగమనాన్ని నమోదు చేశారు. ఆమె చివరిగా ‘తౌబా తేరా జల్వా’ సినిమాలో కనిపించారు.

also read: నమిత సంచలన వ్యాఖ్యలు.. పెళ్లి అయినట్లు గుర్తులు మహిళలకే ఎందుకు? అంటూ ప్రశ్నలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు