ఈ నెల 27, 28 తేదీల మధ్య రాత్రి లింగంపల్లి రైల్వే స్టేషన్‌లోని ఆరో నంబర్ ప్లాట్‌ఫామ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు వ్యక్తులు బైక్‌ను వదిలి పారిపోయేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు. విచారణలో వారు రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్‌ను దొంగిలించినట్లు గుర్తించారు.
పోలీసులు మరింత విచారించగా, మరో ముగ్గురితో కలిసి ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్నట్లు నిందితులు వెల్లడించారు. అరెస్టయిన వారిలో రాజమండ్రికి చెందిన గడ్డం ప్రవీణ్ (21), బురిడి గోపీచంద్ (20), చోడవరపు దినేశ్ కుమార్ (22), గీసాల షణ్ముఖ సత్యసాయి (21), సీరపు దినేశ్ కుమార్ (22) ఉన్నారు.
2025 డిసెంబర్ నుంచి సైబరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో బైక్‌లను దొంగిలిస్తూ, వాటికి నకిలీ నంబర్ ప్లేట్లు అమర్చి రాజమండ్రికి తరలిస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. నిందితుల నుంచి మూడు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు, ఒక కేటీఎం డ్యూక్‌తో పాటు మొత్తం ఐదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ముఠా ఇంకా ఎక్కడెక్కడ చోరీలకు పాల్పడింది? ఇతర వాహనాలు ఎక్కడ ఉన్నాయి? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
also read : విషాద ఘటన…! చిన్నారితో సహా దంపతుల ఆత్మహత్య…
