Homeఆంధ్ర ప్రదేశ్తిరుపతిలో ఉద్రిక్తత.. విద్యార్థినిని జుట్టు పట్టుకుని లాక్కెళ్లిన ఎస్ఐ

తిరుపతిలో ఉద్రిక్తత.. విద్యార్థినిని జుట్టు పట్టుకుని లాక్కెళ్లిన ఎస్ఐ

క్రైమ్ మిర్రర్ : తమకు రావాల్సిన స్టైఫండ్‌ను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ పారా మెడికల్ విద్యార్థులు చేపట్టిన ఆందోళన తిరుపతి అలిపిరి ప్రాంతంలో ఉద్రిక్తతకు దారితీసింది. స్టైఫండ్ బకాయిలను విడుదల చేయాలంటూ విద్యార్థులు, వివిధ విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో నిరసనకు దిగారు.

ఆందోళనలో భాగంగా విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడటంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నిరసనకారులను అక్కడి నుంచి తరలించేందుకు పోలీసులు ప్రయత్నించడంతో విద్యార్థులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో నిరసనలో పాల్గొంటున్న ఓ విద్యార్థినిని మహిళా ఎస్ఐ జుట్టు పట్టుకుని బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్లిన దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. ఈ ఘటనపై విద్యార్థులు, ప్రజల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులతో పాటు వారికి మద్దతుగా వచ్చిన విద్యార్థి సంఘాల నాయకులను కూడా పోలీసులు అక్కడి నుంచి బలవంతంగా తరలించారు. పలువురిని అదుపులోకి తీసుకుని పోలీసు వాహనాల్లో ఎక్కించినట్లు విద్యార్థి సంఘాల నేతలు తెలిపారు. తమకు రావాల్సిన స్టైఫండ్ కోసం శాంతియుతంగా నిరసన చేపడితే పోలీసులు కఠినంగా వ్యవహరించడం సరికాదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వం.. నిరసనలను అణచివేసే ప్రయత్నం చేయడం బాధాకరమని పేర్కొన్నారు.

బకాయిపడిన స్టైఫండ్‌ను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. అలాగే నిరసన సందర్భంగా విద్యార్థినితో అనుచితంగా వ్యవహరించిన పోలీసు అధికారిపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో తిరుపతిలో చోటుచేసుకున్న పరిణామంపై రాజకీయ, విద్యార్థి వర్గాల్లోనూ చర్చ మొదలైంది. ప్రభుత్వం ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
also read : భర్తకు షాకిచ్చిన భార్య.. ప్రియుడితో పెళ్లి చేసిన భర్త

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు