-
తిరిగి చేరేందుకు నాగేందర్ సిద్ధం
-
గ్రీన్ సిగ్నల్ ఇవ్వని బిఆర్ఎస్ నాయకత్వం
-
ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో కఠిన నిర్ణయం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: మాజీ మంత్రి దానం నాగేందర్ తీవ్ర నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారా? గులాబీ పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే తిరిగి చేరేందుకు సిద్ధంగా ఉన్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో ఫిరాయింపుల పర్వం ఎప్పుడు ఆసక్తికరమే.
ఎప్పటికప్పుడు మలుపులు తిరుగుతూనే ఉంటుంది ఈ అంశం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ తరఫున గెలిచి పదిమంది ఎమ్మెల్యేల వరకు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే వీరిపై ఫిరాయింపుల అంశం ఉండనే ఉంది.
అయితే ఇందులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మళ్లీ సొంత గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు ప్రచారం నడుస్తోంది. కాంగ్రెస్లో చేరినప్పటి నుంచి ఆశించిన ప్రాధాన్యత దక్కడం లేదు.
పార్టీ అంతర్గత నిర్ణయాల్లో ప్రాతినిధ్యం లేదు. చివరకు తన మిత్రులు పెట్టుబడులు పెట్టాలన్న ప్రోత్సాహం లేకపోవడంతో తీవ్ర ఆవేదనతో గడుపుతున్నారట దానం నాగేందర్. అందుకే గులాబీ పార్టీ నుంచి పిలుపు వస్తే తిరిగి చేరేందుకు సిద్ధపడుతున్నట్లు పరిస్థితులు తెలియజేస్తున్నాయి.
-
ఏకంగా కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసి..
కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరినప్పటికీ క్యాబినెట్ విస్తరణ జరగలేదు. పార్టీ ఫిరాయింపు మాట పక్కన పెడితే మరో అడుగు ముందుకు వేసి.. దానం నాగేందర్ ఎంపీగా కూడా పోటీ చేశారు. అయినా సరే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశించిన స్థాయిలో ప్రోత్సాహం లేదు. రిస్కుకు తగ్గ ఫలితం లేదు.
అందుకే పునరాలోచనలో పడ్డారు దానం నాగేందర్. కెసిఆర్ నాయకత్వంతో పాటు కేటీఆర్, హరీష్ రావు ల వ్యూహాలను సైతం ప్రశంసిస్తున్నారు. తద్వారా గులాబీ పార్టీతో మళ్ళీ సత్సంబంధాలు పునరుద్ధరించుకునేందుకు సిగ్నల్స్ పంపుతున్నారు.
అయితే దానం నాగేందర్ నుంచి ఈ తరహా సంకేతాలు వెళుతున్నా.. గులాబీ పార్టీ నాయకత్వం మాత్రం అనుకున్న స్థాయిలో స్పందించడం లేదు. దానికి కారణం దానం నాగేందర్ వ్యవహార శైలి కారణం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పార్టీ ఫిరాయించిన మొదటి ఎమ్మెల్యే కూడా ఆయనే. ఈ ప్రయత్నంలో భాగంగా నాగేందర్ గులాబీ పార్టీని ఖాళీ చేయాలని కూడా చూశారు. అందుకే ఆయనపై గులాబీ పార్టీ క్యాడర్ ఆగ్రహంగా ఉంది.
-
నో ఛాన్స్…
ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో గులాబీ పార్టీ నాయకత్వం ఒక నిర్ణయానికి వచ్చిన సంగతి తెలిసిందే. మరోసారి వారికి పార్టీలో ఛాన్స్ లేదని ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నారట. క్లిష్ట సమయంలో పార్టీని వీడి.. ఎన్నికల్లో ప్రత్యర్థిగా నిలిచిన దానం నాగేందర్ లాంటి నేతను మళ్ళీ వెనక్కి తీసుకుంటే కార్యకర్తల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని క్షేత్రస్థాయి నేతలు వాదిస్తున్నారు.
మరోవైపు ఖైరతాబాద్ నియోజకవర్గంలో ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని సిద్ధం చేశారు కూడా. అయితే దానం నాగేందర్ నియోజకవర్గంలో పట్టున్న నాయకుడు. అందుకే ఆయన విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని భావిస్తోంది గులాబీ పార్టీ. పార్టీ మారిన ఎమ్మెల్యేలను మళ్లీ చేర్చుకుంటే రాజకీయంగా విశ్వసనీయత దెబ్బతింటుంది అన్న భావన కేటీఆర్ తో సహా ముఖ్య నేతల్లో ఉంది.
-
ఒకవేళ డోర్స్ ఓపెన్ చేస్తే..
మరోవైపు పార్టీకి ఊపు తేవాలి అంటే నేతలను చేర్చుకోవాల్సి ఉంటుంది. సరైన అదును చూసి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలంటే గేట్లు ఓపెన్ చేయాల్సిందేనన్న టాక్ వినిపిస్తోంది. ఒకవేళ అధికార కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా దెబ్బతీయడానికి.. కాంగ్రెస్ నుంచి రివర్స్ ఆపరేషన్ మొదలయిందని నిరూపించుకోవడానికి అవకాశం గా కెసిఆర్ భావిస్తే మాత్రం.. దానం నాగేందర్ తో పాటు ఫిరాయింపు ఎమ్మెల్యేలంతా తిరిగి గులాబీ పార్టీలో చేరే అవకాశం ఉంది. కేవలం ఫిరాయింపు ఎమ్మెల్యేలు మాత్రమే కాదు.. అధికార పార్టీ ఎమ్మెల్యేలను సైతం ఆకర్షించేందుకు వెనుకడుగు వెయ్యరు కూడా.
