-
చారిత్రాత్మక సంస్కరణకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం
-
పాలనలో వివక్షకు గురైన బాధిత వర్గం
-
తెలంగాణ మున్సిపాలిటీల సవరణ బిల్లుకు శాసనసభలో ఆమోదముద్ర
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చారిత్రాత్మక సంస్కరణకు శ్రీకారం చుట్టింది. సమాజంలో వివక్ష, నిర్లక్ష్యానికి గురవుతున్న ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీని పాలనా వ్యవస్థలో భాగస్వామ్యం చేయాలని నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ స్థానిక సంస్థల పాలనలో సమానత్వం, సామాజిక సాధికారత దిశగా ఈ కీలక నిర్ణయాన్ని అమలు చేయనుంది. మునిసిపాలిటీల సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదముద్ర వేసింది. తద్వారా స్థానిక పట్టణ పరిపాలన వ్యవహారాల్లో ట్రాన్స్ జెండర్ లకు నేరుగా ప్రాతినిధ్యం కల్పించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలవనుంది.
-
ఒక్కో కార్పొరేషన్ లో ఒక్కో పదవి..
కాంగ్రెస్ ప్రభుత్వ తాజా నిర్ణయం.. నూతన చట్ట సవరణ ప్రకారం.. హైదరాబాద్ నగరానికి సంబంధించి కోర్ అర్బన్ రీజియన్ వెలుపల ఉన్న.. రాష్ట్రంలోని తొమ్మిది ప్రధాన మున్సిపల్ కార్పొరేషన్ లలో ట్రాన్స్ జెండర్లకు అవకాశం కల్పిస్తారు.
ప్రతి కార్పొరేషన్ లో ఒక్కో ట్రాన్స్ జెండర్ ను కో ఆప్షన్ సభ్యుడిగా ప్రభుత్వం నామినేట్ చేయనుంది. దీనికి చట్టబద్ధమైన వీలు కల్పించేందుకే తెలంగాణ మున్సిపాలిటీల చట్టం – 2019 కి అవసరమైన సవరణలు చేశారు.
-
ట్రాన్స్ జెండర్ ల ఆనందం..
సమాజంలో చాలా వర్గాలు వివక్షకు లోనవుతున్నాయి. అందులో సంచార జాతులతో పాటు ట్రాన్స్ జెండర్లు ప్రధానమైన వారు. ఈ రెండు వర్గాలు ఇప్పటికీ వివక్షకు గురవుతూనే ఉన్నారు. వీరిని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి కట్టుబడి ఉన్నామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ప్రజా జీవితంలో వారి భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతోంది. పాలనాపరమైన నిర్ణయాధికార ప్రక్రియలు వారికి వేదిక కల్పించడం ద్వారా.. ఆ వర్గం సమస్యలను నేరుగా పరిష్కరించే అవకాశం లభించనుంది.
అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఈ మున్సిపాలిటీల సవరణ బిల్లుకు బిజెపి, సిపిఐ తో పాటు ఇతర విపక్షాల సభ్యులకు కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించారు. దీంతో సభ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ నిర్ణయం పై ట్రాన్స్ జెండర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
