-
లక్ష కోట్లతో భోగాపురంలో రిలయన్స్ ఏఐ డేటా సెంటర్
-
రెండు విడతల్లో నిర్మాణం
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీలో పారిశ్రామిక రంగంలో మరో కీలక ఘట్టం. రిలయన్స్ ఇండస్ట్రీ భారీ పెట్టుబడికి సన్నాహాలు ప్రారంభించింది. విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలో ఏకంగా లక్ష కోట్ల అంచనా వ్యయంతో మెగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ ఏర్పాటుకు సన్నాహాలు మొదలుపెట్టింది.
రాష్ట్రంలో అత్యంత కీలకమైన డిజిటల్ మౌలిక వసతుల కల్పన దిశగా ఈ ప్రాజెక్టు ఒక మైలురాయిగా నిలవనుంది. ఇప్పటికే విశాఖలో ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కానున్న సంగతి తెలిసిందే.
-
అనుబంధ పరిశ్రమలు..
ఈ డేటా సెంటర్ల రాకతో అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు కూడా అవకాశం కలగనుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీ రూపంలో మరో ప్రాజెక్టు రానుండడంతో విజయనగరం జిల్లాలో మరింత అభివృద్ధికి అవకాశం కలగనుంది.
ఈ భారీ డేటా సెంటర్ నిర్వాహక అవసరాల కోసం.. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా సర్వర్ల కూలింగ్ వ్యవస్థ కోసం కోనాడ తీరం నుంచి సముద్రపు నీటిని పైప్ లైన్ ద్వారా బేటా సెంటర్కు తరలించనున్నారు.
సముద్రపు నీటిని ప్రాసెస్ చేసి.. పర్యావరణ అనుకూల రీతిలో కూలింగ్ ప్రక్రియకు ఉపయోగించేలా.. ప్రత్యేకమైన సాంకేతిక మౌలిక వసతులను పొందిస్తున్నారు.
-
భూముల కేటాయింపు..
రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంది. పెద్ద ఎత్తున భూములను కూడా కేటాయించింది. అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టుగా భావించి సుమారు 855 ఎకరాల భూమిని కేటాయించింది. మొత్తం 1.5 గిగావాట్ల భారీ విద్యుత్ సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ పనిచేయనుంది.
దేశంలోనే అతిపెద్ద ఏఐ ఆధారిత హబ్ లలో ఒకటిగా ఇది అవతరించునుంది. ప్రాజెక్టు నిర్మాణ పనులను రెండు ప్రధాన విడతల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో భాగంగా అక్టోబర్ 2028 నాటికి 500 మెగావాట్ల సామర్థ్యంతో మొదటి విడత సేవలు అందుబాటులోకి రానున్నాయి. 2030 నాటికి రెండో విడతను పూర్తి చేసి.. పూర్తిస్థాయి 1.5 గిగావాట్ల సామర్ధ్యాన్ని అందుబాటులోకి తేనున్నారు. ఇది ఏపీకి గేమ్ చేంజర్ గా నిలిచే అవకాశం ఉంది.
