-
ఆర్థిక ఇబ్బందులతో హోమ్ ల్యాండ్ నివి డెవలపర్స్ అధినేత రామ్ రెడ్డి బలవన్మరణం
-
పటాన్చెరు భారీ ప్రాజెక్టు నిలిచిపోవడమే కారణం
-
ఘటనా స్థలంలో సూసైడ్ నోట్, ఆడియో రికార్డింగ్
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: హైదరాబాదులో ప్రముఖ రియల్టర్, హోమ్ ల్యాండ్ నివి డెవలపర్స్ సంస్థ అధినేత బాణాల రామ్ రెడ్డి బలవన్మరణానికి పాల్పడ్డారు. తన సొంత ఫామ్ హౌస్ లో ఆత్మహత్య చేసుకున్నారు. కొన్ని దశాబ్దాలుగా రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో స్థిరపడిన ఆయన.. ఆర్థిక ఇబ్బందులు కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రచారం నడుస్తోంది.
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం నేదునూరు గ్రామంలోని తన ఫామ్ హౌస్ లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. హైదరాబాదులోని మణికొండలో నివాసం ఉంటూ.. గత దశాబ్ద కాలానికి పైగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. అటువంటి వ్యక్తి బలవన్మరణానికి పాల్పడడంతో స్థానిక వ్యాపార వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని గురిచేసింది.
-
భారీ ప్రాజెక్టుకు అడ్డంకులు..
రామ్ రెడ్డి ఆత్మహత్యకు ప్రధానంగా పటాన్చెరు ప్రాంతంలోని భారీ ప్రాజెక్టులో వచ్చిన నష్టాలే కారణమని తెలుస్తోంది. 2018లో పటాన్చెరు పరిధిలో సుమారు 280 ఎకరాల విస్తీర్ణంలో భారీ లేఅవుట్ అభివృద్ధి చేసేందుకు.. నివి డెవలపర్స్ పేరిట స్థానిక రైతుల నుంచి అగ్రిమెంట్లు తీసుకున్నారు.
అయితే లింక్ డాక్యుమెంట్లలో న్యాయపరమైన చిక్కులు రావడం.. కొన్ని భూములు కోర్టు లిటిగేషన్లలో చిక్కుకోవడంతో వెంచర్ పనులు నిలిచిపోయాయి. ప్రాజెక్టు ఆలస్యం కావడంతో రామ్ రెడ్డి పెట్టిన పెట్టుబడులతో పాటు దాదాపు 100 కోట్ల రూపాయలకు పైగా అప్పులు కూరుకు పోయాయి.
-
అన్ని రకాల ఒత్తిళ్లు..
మరోవైపు పటాన్చెరు వెంచర్ పై కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు కన్నేసారు. భారీగా వాటాలు, డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. అడిగినంత ఇవ్వకపోవడంతో రోడ్డు సౌకర్యాలు రాకుండా అడ్డంకులు సృష్టించారని.. రైతులను ఆయనపై రెచ్చగొట్టి భూములు వెనక్కి పెంచేలా ఒత్తిడి తెచ్చారని సమాచారం.
ఒకవైపు అప్పు ఇచ్చిన వారి వేధింపులు, మరోవైపు భూ యజమానుల డిమాండ్లు, రాజకీయ నాయకుల ఒత్తిళ్లు తట్టుకోలేక ఆయన తీవ్ర మనస్థాపానికి గురయ్యారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మరోవైపు ఘటనా స్థలంలో పోలీసులకు సూసైడ్ నోట్, ఆడియో రికార్డింగ్ దొరికింది.
ఆడియో రికార్డింగ్లో ప్రాజెక్టు ప్రారంభంలో సరైన పత్రాలు సరిచేసుకోకపోవడమే తన తప్పని ఆయన పేర్కొన్నారు. ఆత్మహత్య వెనుక ఉన్న కారణాలపై పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు.
