క్రైమ్ మిర్రర్ : కారులో గంజాయి ప్యాకెట్లను విక్రయిస్తున్న ఓ మహిళను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె వద్ద నుంచి 2.10 కిలోల గంజాయితో పాటు కారును స్వాధీనం చేసుకున్న ఘటన ధూల్‌పేట్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ధూల్‌పేట్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని సీతారాంబాగ్ రోడ్, మంగర్ బస్తీ ప్రాంతంలో కారులో గంజాయి విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన ఎక్సైజ్ అధికారులు ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశారు.
సమాచారం ఆధారంగా ఎస్‌హెచ్‌ఓ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో సీఐలు విప్లవ రెడ్డి, వెంకన్న, జనార్దన్, సాబీర్, హెడ్ కానిస్టేబుల్ తదితరులు కలిసి దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా కే. రాజేశ్వరి అనే మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద ఉన్న గంజాయి ప్యాకెట్లను పరిశీలించగా మొత్తం 2.10 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. గంజాయితో పాటు నిందితురాలు వినియోగిస్తున్న కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ వ్యవహారంలో మరికొందరి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మకన్ లాల్, రాం లాల్, లకన్ లాల్‌లపై కూడా కేసు నమోదు చేసినట్లు సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. గంజాయి ఎక్కడి నుంచి తీసుకువచ్చారు, ఎవరికి విక్రయిస్తున్నారు అనే కోణాల్లో ఎక్సైజ్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
also read : విద్యార్థిని పట్ల ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన.. విద్యార్థిని తల్లిదండ్రుల దాడి
