Homeక్రైమ్జైపూర్‌లో దారుణం.. భార్య, ముగ్గురు కుమార్తెలను హతమార్చి పరారైన వ్యక్తి

జైపూర్‌లో దారుణం.. భార్య, ముగ్గురు కుమార్తెలను హతమార్చి పరారైన వ్యక్తి

క్రైమ్ మిర్రర్ : రాజస్థాన్‌లోని జైపూర్‌లో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యతో పాటు ముగ్గురు కుమార్తెలను నిద్రలో ఉండగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత కర్దాని పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గోవింద్‌పుర ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం.. గోవింద్‌పురలోని ఓ ఇంట్లో రాహుల్ ఝా తన భార్య గీతా ఝా, ముగ్గురు కుమార్తెలు నందిని (23), రాధిక (18), గౌరి (14), తండ్రితో కలిసి నివసిస్తున్నాడు. గురువారం రాత్రి కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల మధ్య రాహుల్ వారిపై దాడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇంటి నిర్మాణానికి ఉపయోగించే భారీ రాయితో నలుగురి తలలపై దాడి చేసి హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. బాధితులు నిద్రలో ఉండటంతో వారికి ప్రతిఘటించే అవకాశం లేకపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. గీతా ఝా మృతదేహం ఇంటి మొదటి అంతస్తులోని గదిలో లభించగా.. ముగ్గురు కుమార్తెల మృతదేహాలు గ్రౌండ్‌ఫ్లోర్‌లోని రెండు గదుల్లో కనిపించాయి.

తండ్రికి టీ ఇచ్చి.. ఆపై పరారీ

హత్యల అనంతరం కూడా రాహుల్ ఝా కొంతసేపు ఇంట్లోనే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఉదయం సుమారు 6 గంటల వరకు అక్కడే ఉన్న అతడు.. మరో గదిలో ఉన్న తన తండ్రికి టీ తయారు చేసి ఇచ్చినట్లు వెల్లడించారు. ఆ సమయంలో ఎలాంటి అనుమానం కలగకుండా సాధారణంగానే ప్రవర్తించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఇంటి నుంచి వెళ్లిపోయి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అక్కడి నుంచి ఆధారాలను సేకరించి కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

కుటుంబంలో నెలకొన్న వివాదాలే ఈ దారుణానికి కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అయితే హత్యలకు దారితీసిన అసలు కారణాలను నిర్ధారించేందుకు దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గోవింద్‌పుర ప్రాంతంలో భద్రతను పెంచారు.
also read : తెలంగాణలో ఆర్టిఫిషియల్ పనీర్‌పై ఏడాది నిషేధం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు