క్రైమ్ మిర్రర్ : ఉత్తరప్రదేశ్‌లో తీవ్ర విషాదకర ఘటన వెలుగుచూసింది. మద్యం మత్తులో ఉన్న వైద్యుడు గర్భిణికి శస్త్రచికిత్స చేసినట్లు ఆరోపణలు రావడం కలకలం రేపింది. సర్జరీ అనంతరం మహిళ పరిస్థితి విషమించి.. మెరుగైన చికిత్స కోసం మరో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. ఈ ఘటన షాజహాన్‌పూర్ జిల్లాలో సెప్టెంబర్ 8న చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం.. పువాయాన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కాకర్హ గ్రామానికి చెందిన జూలీ గర్భిణి. సెప్టెంబర్ 8న సాయంత్రం ఆమెకు పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు బయలుదేరారు. అయితే మార్గమధ్యంలో పువాయాన్ సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి వద్ద అంబులెన్స్ డ్రైవర్ వాహనాన్ని ఆపాడు. అక్కడ వైద్యం మెరుగ్గా అందుతుందని డ్రైవర్ సూచించడంతో కుటుంబ సభ్యులు నొప్పులతో బాధపడుతున్న జూలీని అదే ఆస్పత్రిలో చేర్పించారు. ఆ సమయంలో ఆస్పత్రిలో విధుల్లో ఉన్న డాక్టర్ ఫిరోజ్ మరో వైద్యుడు కేపీకి సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు.
మద్యం మత్తులోనే శస్త్రచికిత్స?
ఆస్పత్రికి చేరుకున్న డాక్టర్ కేపీ మద్యం సేవించిన స్థితిలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. సరిగ్గా నిలబడలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ గర్భిణికి శస్త్రచికిత్స చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. శస్త్రచికిత్స అనంతరం జూలీ ఓ బిడ్డకు జన్మనిచ్చింది.అయితే ప్రసవం తర్వాత ఆమె ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో మెరుగైన వైద్యం కోసం బరేలీలోని పెద్ద ఆస్పత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. కుటుంబ సభ్యులు ఆమెను అంబులెన్స్‌లో బరేలీకి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే జూలీ మృతి చెందింది.
వైద్యులపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు
జూలీ మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఆమె ప్రాణాలు కోల్పోయిందని ఆరోపించారు. ముఖ్యంగా డాక్టర్ కేపీ మద్యం మత్తులో శస్త్రచికిత్స చేయడం వల్లే పరిస్థితి విషమించిందని పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నామని, వైద్యుల పాత్రపై కూడా విచారణ జరుపుతున్నామని అధికారులు తెలిపారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు పేర్కొన్నారు.
also read : పదో తరగతి విద్యార్థినిపై టీచర్ వేధింపులు.. మనస్తాపంతో బాలిక ఆత్మహత్య
