క్రైమ్ మిర్రర్ : హైదరాబాద్లోని అంజయ్య నగర్లో ఓ హాస్టల్లో పనిచేస్తున్న వంట మనిషి దారుణ హత్యకు గురయ్యాడు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం.. అంజయ్య నగర్లోని ఓ హాస్టల్లో శశిధర్ రాజు (40), ప్రమోద్ కొంతకాలంగా వంట పనులు చేస్తూ జీవిస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గతంలో ఏర్పడిన విభేదాలే హత్యకు దారితీసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
అయితే శుక్రవారం ప్రమోద్ అకస్మాత్తుగా శశిధర్ రాజుపై కత్తితో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. తీవ్ర గాయాల కారణంగా శశిధర్ రాజు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతుడు, నిందితుడు ఇద్దరూ ఒడిశా రాష్ట్రానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఘటన అనంతరం ప్రమోద్ అక్కడి నుంచి పరారైనట్లు తెలిపారు. అతడి ఆచూకీ కోసం ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. హాస్టల్ పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాల్లో హత్యకు సంబంధించిన దృశ్యాలు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. పాత కక్షలే హత్యకు అసలు కారణమా? లేదా మరేదైనా అంశం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
also read : “తెలంగాణ వచ్చినా నాకు ఒరిగిందేమీ లేదు”- ఉదయభాను సంచలన వ్యాఖ్యలు
