-
ఎన్నికల్లో గెలిచేందుకు భారీగా నగదు తాయిలాలు
-
లక్షల కోట్లు పంచేందుకు సిద్ధం
-
భారత సంక్షేమ పథకాలే ఆదర్శం
క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: డబ్బంటే ఎవరికి చేదు. ఈ మాట వంట పట్టించుకున్నారు కాబట్టి మన దేశంలో ఓటును నోటుతో జత చేస్తున్నారు. సంక్షేమ పథకాలతో ప్రజల ఓట్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు మన దేశ రాజకీయాలను ఆదర్శంగా తీసుకున్నట్టు ఉన్నారు అగ్రరాజ్యం అధినేత డోనాల్డ్ ట్రంప్.
ఏకంగా అమెరికాలో సంక్షేమ బాట పట్టారు. గెలిపించండి.. నగదు అందుకోండి అంటూ బంపర్ ఆఫర్ ప్రకటించారు. నిజంగా ఇది భారతదేశ సంక్షేమ ఆదర్శమే. ఇక్కడి ఫార్ములాను అమెరికాలో అప్లై చేసి.. రాజకీయ స్థిరత్వాన్ని కోరుకుంటున్నారు డోనాల్డ్ ట్రంప్.
-
సంక్షేమానికి మనం మొగ్గు..
సాధారణంగా మనదేశంలో ఎన్నికలు సంక్షేమ పథకాలు, ఖాతాల్లో నగదు జమ చేసే ఉచిత హామీల చుట్టూ తిరుగుతాయి. వాటిని రాజకీయ పార్టీలు అస్త్రాలుగా మార్చుకుంటాయి. అభివృద్ధి, మౌలిక వసతుల కంటే ప్రజల జేబుల్లో నేరుగా నగదు వేస్తే చాలు.. అధికారం మనదే అన్న ఫార్ములాను భారతదేశంలో రాజకీయ పార్టీలు అనుసరిస్తున్నాయి.
ఇప్పుడు అచ్చంగా అదే ఇండియన్ స్టైల్ పాపులిజం, ఫార్ములాను అగ్రరాజ్యం అధినేత డోనాల్డ్ ట్రంప్ ఒడిసి పట్టుకున్నట్టు కనిపిస్తున్నారు. నవంబర్ లో జరిగే మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లు సెనేట్, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఎన్నుకుంటే.. ప్రతి అమెరికన్ కు ఏకంగా 5 వేల డాలర్లు అందిస్తామంటూ ఆఫర్ చేశారు. మన ఇండియన్ కరెన్సీ బట్టి దాదాపుగా 5 లక్షల రూపాయల ట్రంప్ డివిడెంట్ కింద అందిస్తామంటూ ప్రకటన చేశారు.
-
వాటిని పక్కన పెట్టి మరి..
అమెరికాలో ఎన్నికలు సాధారణంగా ద్రవ్యోల్బణం, పన్ను రాయితీలు, ఇమ్మిగ్రేషన్ విధానాలు, విదేశాంగ విధానం వంటి విస్తృత ఆర్థిక, విధానపరమైన అంశాల చుట్టూ తిరుగుతాయి. కానీ ట్రంప్ వాటన్నింటినీ పక్కనపెట్టి.. భారత్లోని సంక్షేమ హామీల తరహాలో.. మీరు మా పార్టీకి ఓటేసి గెలిపిస్తేనే మీ ఖాతాల్లోకి 5,000 డాలర్లు వస్తాయంటూ బహిరంగంగా షరతు విధించడం విశేషం.
డల్లాస్ లో జరిగిన రిపబ్లికన్ల సదస్సులో మాట్లాడిన ఆయన.. దేశం ఆర్థికంగా అద్భుత పురోగతి సాధించిందని.. దాని ఫలాలను ప్రజలకు డివిడెంటుగా ఇస్తామని చెప్పుకొచ్చారు. కానీ ఈ డబ్బులు రావాలంటే మాత్రం ఉభయ సభల్లోనూ రిపబ్లికన్లదే మెజారిటీ ఉండాలని గట్టిగానే చెప్పుకొచ్చారు. ఓటర్లను నేరుగా ప్రలోభ పెట్టే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.
-
ఖజానా పై భారీ భారం..
అయితే అమెరికాలో ఈ ఎన్నికల హామీ ఖరీదు భారీగానే ఉంటుంది. ఖజానా పై భారీగా భారం పడనుంది. సుమారు 24 నుంచి 25 కోట్ల మందికి ఈ నగదు పంపిణీ చేయాలంటే.. ఏకంగా 1.2 ట్రిలియన్ నుంచి 1.35 ట్రిలియన్ డాలర్లు అవసరం అవుతాయి. సాధారణ ఎన్నికల లబ్ధి కోసం ఏకంగా లక్షల కోట్లను పంచేందుకు ట్రంప్ సిద్ధమవుతుండడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
ఇప్పటికే విదేశీ దిగుమత్తులపై విధించిన భారీ సుంకాల ద్వారా వచ్చిన సొమ్ముతో ఈ పథకాన్ని నడిపిస్తామని ట్రంప్ వర్గాలు చెబుతున్నాయి. కానీ ప్రస్తుతం భారీగా అప్పుల ఊబిలో ఉన్న అమెరికా ఆర్థిక వ్యవస్థ పై ఇది పెను భారమే.
