-
ఆయుధాల చోరీలో కళ్ళు బైర్లు కమ్మే నిజాలు
-
దర్యాప్తులో వెలుగు చూస్తున్న వాస్తవాలు
-
తవ్వే కొద్ది సంచలనాలే..
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: ఆర్మీ ఆయుధాలు చోరీ ఇంటి మనుషుల పనియేనా? సొంతవారే ఈ ఘాతకానికి పాల్పడ్డారా? అధికారులే ఈ ఆయుధాలను కొట్టేశారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అత్యున్నత దర్యాప్తులో ఇంటి దొంగల వ్యవహారమేనని తేలిపోయినట్లు తెలుస్తోంది. దీంతో దర్యాప్తు మరింత ముమ్మరంగా సాగుతోంది.
-
చురుగ్గా దర్యాప్తు..
సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని.. బొల్లారం 20 మద్రాస్ రెజిమెంట్ ఆర్మరిలో ఆయుధాలు మాయం అయిన వ్యవహారం సంచలనం సృష్టించింది. అయితే దొంగలు తాళాలు పగలగొట్టి ఒకేసారి ఈ దోపిడీకి పాల్పడ్డారని అంతా భావించారు. కానీ దర్యాప్తులో కళ్ళు బైర్లు కమ్మేలా నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.
మిలటరీ ఇంటలిజెన్స్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, స్థానిక పోలీసులు సంయుక్తంగా విచారణ చేపడుతున్నారు. అయితే ఇది ఒకే రోజులో జరిగిన చోరీ కాదని.. పక్కా ప్రణాళిక ప్రకారం నడిచిన ఇంటి దొంగల వ్యవహారమని అధికారులు తేల్చినట్లు తెలుస్తోంది..
-
ఆడిట్ లో తేడాతో వెలుగులోకి..
ఇటీవల ఈ ఆయుధాల చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. వార్షిక ఆయుధాల ఆడిట్లో లెక్కల్లో వ్యత్యాసాలు రావడంతో.. ఈ ఘరానా చోరీ వెలుగులోకి వచ్చింది. గత మూడు నెలల కాలంలో ఒక్కొక్కటిగా ఆయుధాలను దశలవారీగా డిపో నుంచి బయటకు తరలించినట్లు స్థానిక అధికారులు నిర్ధారణకు వచ్చారు.
దర్యాప్తు సంస్థల ప్రాథమిక అంచనా ప్రకారం.. అత్యంత ప్రమాదకరమైన నాలుగు ఏకే 47 అసాల్ట్ రైఫిళ్లు, రెండు ఇన్సాస్ రైఫిళ్లు, 9 ఫిస్టళ్లు, నైట్ విజన్ పరికరాలతో పాటు ఏకంగా 2000 పైగా బుల్లెట్లను మాయం చేశారు. సైనిక కేంద్రం నుంచి ఇంత ఆయుధ సంపత్తి మాయం కావడం రక్షణ శాఖను కుదిపేస్తోంది.
-
కుట్రపూరిత నేరంగా..
అంతా ఒక కుట్రపూరిత నేరంగా దీనిని మార్చినట్లు స్పష్టమవుతోంది. ఆర్మరి వద్ద సీసీటీవీ కెమెరాలను షార్ట్ సర్క్యూట్ నెపంతో రాత్రి వేళల్లో నిలిపివేశారు. భద్రత అలారం లు పనిచేయకుండా కుట్రపూరితంగా వ్యవహరించారు. అసలు ఈ దొంగతనం బయట వారే చేశారని నమ్మించేందుకు.. వర్షం పడుతున్న సమయంలో తాళాలు పగులగొట్టి దొంగతనం జరిగినట్లు పెద్ద డ్రామా ఆడారు.
ప్రస్తుతం మిలటరీ ఇంటెలిజెన్స్ ముగ్గురు ఆర్మీ ఉన్నతాధికారులను మేజర్ ర్యాంక్ అధికారులతో సహా.. భద్రతా విభాగంలో పనిచేసే పలువురు జవాన్లను అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతంలో ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ఇక్కడ మాయమైన ఆయుధాలు ఎక్కడికి వెళ్లాయి? వ్యాపారులకు విక్రయించారా? గ్యాంగ్స్టర్లకు చేరాయా? తీవ్రవాద నెట్వర్కుల చేతికి చిట్కాయ అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
