క్రైమ్ మిర్రర్ : హర్యానాలో దారుణ హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. తన భార్యతో స్నేహితుడైన జితేంద్ర వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే అనుమానంతో ఓ వ్యక్తి అతడిని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హర్యానాలోని రేవారి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సెప్టెంబర్ 7న హెచ్‌పీసీఎల్ రిఫైనరీ సమీపంలోని నిర్మానుష్య రహదారిపై 40 ఏళ్ల జితేంద్ర మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. రక్తపు మడుగులో పడి ఉన్న అతడి తలపై తీవ్ర గాయాలు కనిపించడంతో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించారు. మరోవైపు జితేంద్ర కుటుంబ సభ్యులు వ్యక్తం చేసిన అనుమానాలు, పోలీసులు సేకరించిన ఇతర ఆధారాల ఆధారంగా అతడి స్నేహితుడు ప్రవీణ్ అలియాస్ పాప్లా, అతడి మేనల్లుడు అమన్‌పై దృష్టి సారించారు. అనంతరం ఇద్దరినీ అరెస్ట్ చేసి విచారించారు.
విచారణలో జితేంద్రను హత్య చేయడానికి గల కారణాన్ని ప్రవీణ్ వెల్లడించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. తన భార్యతో జితేంద్రకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానం కొంతకాలంగా ప్రవీణ్‌కు ఉన్నట్లు చెప్పారు. ఈ కారణంగానే జితేంద్రపై కక్ష పెంచుకున్నాడని పోలీసులు పేర్కొన్నారు.
సెప్టెంబర్ 7న బీర్ పార్టీకి వెళ్దామంటూ జితేంద్రను ప్రవీణ్ పిలిచినట్లు సమాచారం. అనంతరం అమన్‌తో కలిసి ఓ వాహనంలో అతడిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అక్కడ జితేంద్ర వాహనం నుంచి దిగిన వెంటనే ప్రవీణ్ ఇనుప రాడ్‌తో అతడి తలపై పలుమార్లు దాడి చేసినట్లు విచారణలో వెల్లడైందని అధికారులు తెలిపారు. తీవ్ర గాయాల కారణంగా జితేంద్ర అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు.
జితేంద్ర ఓ బీజేపీ నేతకు మేనల్లుడిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు హత్యకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితులు ఉపయోగించిన వాహనం, హత్యకు ఉపయోగించినట్లు అనుమానిస్తున్న ఇనుప రాడ్‌ను స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. మరోవైపు, ఈ హత్య వెనుక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయి విచారణ అనంతరం కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
also read : కో ఆప్షన్ సభ్యులుగా ట్రాన్స్ జెండర్లు…!
