-
క్రమేపీ కనుమరుగవుతున్న తెలంగాణ యాస
-
జెన్ జీ, డిజిటల్ నేటిజన్ల కోసం కొత్త ప్రయోగం
-
ఆపై సినిమా రిఫరెన్సులు
-
సరికాదంటున్న విశ్లేషకులు
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: రాజకీయాల్లో వాగ్దాటి అనేది ముఖ్యం. అనర్గళంగా మాట్లాడాలి. అనుకున్నది చెప్పాలి. ప్రత్యర్థిని డిఫెన్స్ లో పెట్టాలి. ఈ విషయంలో గులాబీ పార్టీ బాస్ కెసిఆర్ ముందు వరసలో ఉంటారు. ఆయన అటాక్ చేస్తే ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే.
అయితే ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు కేటీఆర్. తండ్రి మాదిరిగానే కేటీఆర్ అనర్గళంగా మాట్లాడగలరు. సూటిగా, సుత్తి లేకుండా ప్రసంగించగలరు. కానీ కేటీఆర్ ప్రసంగసైలి ఇటీవల పూర్తిగా మారిపోయింది.
ఇప్పటివరకు తెలంగాణ యాసలో సీరియస్ గా సాగేది ఆయన ప్రసంగం. కానీ ఇప్పుడు స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. యాసలో కాస్త తేడా మాత్రమే కాదు. జెన్ జీ కోసం అన్నట్టుగా ప్రాసలు, సినిమా రిఫరెన్స్ లు జోడించి ప్రసంగిస్తున్నారు. అయితే గతం మాదిరిగా సహజత్వం లోపిస్తోంది ఆయన ప్రసంగంలో..
-
సినిమా రీల్స్ తో..
ఇటీవల వరంగల్ లో సభ జరిగింది. కేటీఆర్ తన ప్రసంగంలో ఓ సినిమాలో కమెడియన్ బ్రహ్మానందం చేసే ప్రయత్నాలను ప్రస్తుత పాలకులకు ఆపాదిస్తూ ప్రసంగించారు. ఈ వీడియోలను గులాబీ పార్టీ సోషల్ మీడియా విభాగాలు విపరీతంగా వైరల్ చేశాయి. గతంలో తరచూ యువతను ఆకట్టుకోవడానికి ట్రెండింగ్ పాప్ కల్చర్ రిఫరెన్స్ లను విమర్శల మధ్యలో వాడుతుండేవారు.
కానీ ఇప్పుడు అదే రొటీన్ ట్రెండ్ ను కేటీఆర్ అతిగా అనుసరిస్తూ సినిమా డైలాగులను రాజకీయాలకు లింక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ పోలిక సందర్భానికి సహజ సిద్ధంగా సరిపోవాలి. అది చూసేవారికి కనెక్ట్ అయ్యేలా ఉంటేనే అది పండుతుంది. కానీ కేటీఆర్ చేస్తున్న ప్రయత్నం తేలిపోతుంది. అసహజంగా ఉంది.
-
హై ప్రొఫైల్ లీడర్ గా..
తెలంగాణ యాసలో కేటీఆర్ మాట్లాడితే చాలా బాగుంటుంది. సామాన్య జనాలకు ఆకట్టుకుంటుంది కూడా. అయితే కేటీఆర్ లో ఇప్పుడు వచ్చిన మార్పు ఎంత మాత్రం నచ్చడం లేదు. ప్రజల్లోకి బలంగా వెళ్లడం లేదు. కేవలం జెన్ జి, డిజిటల్ నెటిజన్లను ఆకర్షించుకునేందుకే నన్నట్టు కేటీఆర్ ప్రసంగాలు ఉంటున్నాయి.
వాస్తవానికి కేటీఆర్ ఇప్పుడు హై ప్రొఫైల్ పొలిటికల్ లీడర్. అటువంటి ఆయన తన ప్రసంగ శైలిని మార్పు చేసుకోవడం, ప్రయోగాల కోసం కొత్త తరహా వ్యాఖ్యలు చేయడం అత్యంత ప్రమాదకరం. కేటీఆర్ ఒకప్పుడు తన ప్రసంగాలతో సభలను మైమరిపించిన నాయకుడు అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి.
అటువంటి నేత ఇప్పుడు సోషల్ మీడియాలో షార్ట్స్, రీల్స్ కట్ చేసుకోవడానికి సినిమా కామెడీ సీన్లను ఆశ్రయిస్తున్నారని సంకేతం వెళ్లడం ఎంత మాత్రం సహేతుకం కాదు అనేది విశ్లేషకుల మాట.
