క్రైమ్ మిర్రర్ : ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత హరీశ్ రావత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తనకు ఉన్న రెండు పార్టీ పదవుల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. రావత్ మాజీ పీఏ చందన్ సింగ్ జీనా నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించిన నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది.
ఉత్తరాఖండ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (PCC) కార్యవర్గ సభ్యుడిగా ఉన్న పదవితో పాటు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC)లో శాశ్వత ఆహ్వానితుడిగా ఉన్న బాధ్యతల నుంచి కూడా రావత్ వైదొలిగారు. ఎన్నికల సమయంలో తన కారణంగా పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేదా రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
ఇదిలా ఉంటే.. గురువారం దెహ్రాదూన్‌లోని పలు ప్రాంతాల్లో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. 2016లో ఉత్తరాఖండ్ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ కమిషన్ నిర్వహించిన నియామక పరీక్షలో ఓఎంఆర్ షీట్లను మార్చి అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై చందన్ సింగ్ జీనా పేరుతో నమోదైన కేసుకు సంబంధించి ఈ సోదాలు జరిగినట్లు సమాచారం.
ఈడీ వెల్లడించిన వివరాల ప్రకారం.. జీనా నివాసంలో తనిఖీల సందర్భంగా సుమారు రూ.32 లక్షల నగదు, దాదాపు 200 గ్రాముల బంగారు నాణేలు, ఆభరణాలు, 12 ఖరీదైన వాచీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా జీనా, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన బ్యాంకు ఖాతాల్లో ఉన్న సుమారు రూ.52.16 లక్షల మొత్తాన్ని కూడా అధికారులు స్తంభింపజేసినట్లు తెలిపింది.
మరోవైపు, చందన్ సింగ్ జీనాపై వచ్చిన ఆరోపణలను తాను విశ్వసించడం లేదని హరీశ్ రావత్ స్పష్టం చేశారు. జీనా చాలా కష్టపడి పనిచేసే వ్యక్తి అని ఆయన పేర్కొన్నారు. అయితే దర్యాప్తు సంస్థల వద్ద ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని రావత్ తెలిపారు. హరీశ్ రావత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చందన్ సింగ్ జీనా ఓఎస్డీగా పనిచేశారు. అనంతరం ఆయన రావత్‌కు పీఏగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో జీనా నివాసంలో ఈడీ సోదాలు, తాజాగా హరీశ్ రావత్ తన పార్టీ పదవులకు రాజీనామా చేయడం ఉత్తరాఖండ్ రాజకీయాల్లో చర్చకు దారితీసింది. ఎన్నికల సమయంలో ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? హరీశ్ రావత్ తీసుకున్న నిర్ణయం పార్టీ రాజకీయ వ్యూహంలో ఎలాంటి మార్పులకు దారితీస్తుందనే అంశంపై ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
also read : యూట్యూబర్ రమా నందనకు మరోసారి పోలీసుల నోటీసులు
