-
వైసీపీలో క్రమేపి తగ్గుతున్న ప్రాధాన్యత
-
కేవలం గుంటూరు జిల్లా వరకే పరిమితం
-
తెర వెనుక సజ్జల రామకృష్ణారెడ్డి
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో వైవి సుబ్బారెడ్డి పాత్ర తగ్గుతోందా? ఆయనకు ప్రాధాన్యత తగ్గిస్తున్నారా? ఈ విషయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట చెల్లుబాటు అయ్యిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి.
ఇటీవల రీజనల్ కోఆర్డినేటర్లతో పాటు జిల్లా సమన్వయకర్తల చేర్పులు,మార్పులు చేశారు. అందులో వైవి సుబ్బారెడ్డి కి కేవలం గుంటూరు జిల్లాకు మాత్రమే పరిమితం చేశారు.
దీంతో వైవి సుబ్బారెడ్డి ప్రాధాన్యత తగ్గుతోందన్న ప్రచారం పొలిటికల్ వర్గాల్లో ఉంది. దీని వెనుక సజ్జల రామకృష్ణారెడ్డి హస్తం ఉన్నట్లు వైసీపీలోనే ప్రచారం నడుస్తోంది.
-
జగన్ కు సమీప బంధువు
జగన్మోహన్ రెడ్డికి సమీప బంధువు వైవి సుబ్బారెడ్డి. స్వయానా బాబాయ్. పార్టీలో అత్యంత సుదీర్ఘ అనుభవం కూడా ఆయనకు ఉంది. ఇప్పటివరకు ఆయనకు వైసీపీలో ఎనలేని ప్రాధాన్యం దక్కుతూ వస్తోంది.
అటువంటి నేతకు కేవలం ఒకే ఒక్క గుంటూరు జిల్లా బాధ్యతలకు పరిమితం చేయడం చర్చకు దారి తీస్తోంది. ఆయన ప్రాధాన్యతను తగ్గించి.. ఇతర నాయకుల ప్రాధాన్యం పెంచడం వెనుక రకరకాల చర్చ మొదలైంది. ప్రధానంగా సజ్జల రామకృష్ణారెడ్డి తెరవెనుక ఉండి చేయిస్తున్నారు అనేది పార్టీలో ఒక వాదన. ఇప్పటికే విజయసాయిరెడ్డి పక్కకు వెళ్లిపోయారు.
మరోవైపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రాధాన్యత తగ్గిపోయింది. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డిని తప్పించడం ద్వారా.. సజ్జల వన్ మ్యాన్ షో నడపాలని చూస్తున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
-
ఇతర నేతలకు దక్కిన ప్రాధాన్యం..
వై వి సుబ్బారెడ్డి తో పోల్చుకుంటే ఇతర నాయకులకు ప్రాధాన్యత పెంచారు. ఆళ్ల అయోధ్య రామిరెడ్డికి రెండు జిల్లాల సమగ్ర బాధ్యతలను కట్టబెట్టారు. మద్యం కుంభకోణం కేసులో ప్రస్తుతం అరెస్టులో ఉన్న కారుమూరి నాగేశ్వరరావుకు ఒక జిల్లా బాధ్యతను తగ్గించారు.
తద్వారా పార్టీలో పవర్ సెంటర్లు మారాయని అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. వైసీపీలో అధికార కేంద్రాల మధ్య అంతర్గత యుద్ధాన్ని ఈ కొత్త నియామకాలు బయట పెడుతున్నాయి. అయితే ఈ పరిణామాలకు కారణం సజ్జల రామకృష్ణారెడ్డి అనేది బహిరంగ రహస్యం.
జగన్మోహన్ రెడ్డితో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో తన ముద్రను బలంగా నిలుపుకుంటూ… సుబ్బారెడ్డి ప్రభావాన్ని తగ్గించేందుకు సజ్జల ఇలా పావులు కదుపుతున్నారు అనేది ఒక వాదన.
-
గట్టి పోరాటమే..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2 పొజిషన్ కోసం గట్టి పోరాటమే నడుస్తోంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఆ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటూ ముందుకు సాగారు విజయసాయిరెడ్డి. పార్టీ ఏర్పాటుతో పాటు అధికారంలోకి వచ్చేందుకు అహర్నిశలు శ్రమించారు.
ఒక్కమాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డికి మించి విజయసాయిరెడ్డి పార్టీ కోసం పాటుపడ్డారు. అయితే అటువంటి విజయసాయిరెడ్డికి సైడ్ చేయగలిగారు సజ్జల రామకృష్ణారెడ్డి. కేవలం సాక్షిలో ఎడిటోరియల్ డైరెక్టర్ గా ఉన్న సజ్జల అనతికాలంలోనే వైసీపీలో తన పొజిషన్ మరింత స్ట్రాంగ్ చేసుకున్నారు.
ఇప్పుడు దానిని మరింత పదిలం చేసుకునేందుకే.. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైన వారిని పొమ్మనలేక పొగ పెడుతున్నారు. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి విషయంలో కూడా జరిగింది అదే.
