Homeతెలంగాణమర్రిగూడ ఎంపిడివో కార్యాలయంలో రచ్చ..!

మర్రిగూడ ఎంపిడివో కార్యాలయంలో రచ్చ..!

  • మర్రిగూడ ఎంపిడివో కార్యాలయంలో రచ్చ
  • అధికారుల తీరుపై నూతన సర్పంచ్‌ల ఆగ్రహం

​మర్రిగూడ, (క్రైమ్ మిర్రర్):- మండల కేంద్రంలోని ఎంపిడివో కార్యాలయం వేదికగా జరిగిన, నూతన సర్పంచ్‌ల సన్మాన కార్యక్రమం వాడివేడిగా సాగింది. ఒకవైపు అధికారిక సన్మానాలు జరుగుతుండగానే, మరోవైపు మండల అధికారుల పనితీరుపై, సర్పంచ్‌లు నిలదీయడంతో వాతావరణం ఉత్కంఠభరితంగా మారింది.

​సన్మాన గ్రహీతలుగా వచ్చిన మేటిచందాపురం సర్పంచ్ పదం రవి, శివన్నగూడెం సర్పంచ్ రాపోలు యాదగిరి, యరుగండ్లపల్లి సర్పంచ్ వల్లంల సంతోష్ యాదవ్ అధికారుల వ్యవహారశైలిపై మండిపడ్డారు. మండల అభివృద్ధి పనుల్లో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోందని, క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పట్టించుకోవడం లేదని వారు ధ్వజమెత్తారు. ​

ఇందిరమ్మ ఇండ్లు.. పైరవీల అడ్డా!:

​ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరు అంశంపై, సర్పంచ్‌లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అర్హులకు కాకుండా పైరవీకారులకే ఇండ్లు దక్కుతున్నాయని, ఇది సామాన్యుల్లో ప్రభుత్వంపై నమ్మకాన్ని పోగొడుతోందని ఆరోపించారు. గ్రామంలో ప్రజలు తమను నిలదీస్తున్నారని, ఇండ్ల కేటాయింపులో పారదర్శకత లేకపోవడం వల్ల, తాము ప్రజలకు సమాధానం చెప్పుకోలేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.  ప్రజలకు మేలు చేసేలా, అభివృద్ధికి సహకరించేలా అధికారులు వ్యవహరించాలని సర్పంచ్ పదం రవి డిమాండ్ చేశారు.

సమన్వయంతోనే అభివృద్ధి:

​అధికారులు, సర్పంచ్‌ల మధ్య సమన్వయం ఉంటేనే గ్రామాలు బాగుపడతాయని, నిధుల వినియోగం నుంచి పథకాల అమలు వరకు తమకు పూర్తి సహకారం అందించాలని నూతన సర్పంచ్‌లు కోరారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు..

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు