తెలంగాణలో బుల్లితెర రంగానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. టెలివిజన్ రంగంలో ప్రతిభ కనబరుస్తున్న కళాకారులు, సాంకేతిక నిపుణులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక టెలివిజన్ అవార్డులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి.
ఈ అవార్డులకు ప్రముఖ నాయకుడు, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరు పెట్టే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. దీనిపై సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. టెలివిజన్ రంగ అభివృద్ధికి ఈ అవార్డులు ఎంతో ఉపయోగపడతాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇటీవల సచివాలయంలో టెలివిజన్ అవార్డు కమిటీ ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అవార్డుల రూపకల్పన, లోగో, విభాగాలు (కేటగిరీలు), పేరుపై విస్తృతంగా చర్చించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా అవార్డుల రూపకల్పన ఉండాలని మంత్రి సూచించారు.
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తెలుగు జాతి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన మహానుభావుడని పేర్కొంటూ, ఆయన పేరును అవార్డులకు పెట్టే ప్రతిపాదనపై ప్రభుత్వం సానుకూలంగా ఆలోచిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించిన తర్వాత తుది నిర్ణయం ప్రకటించనున్నట్లు చెప్పారు.
అవార్డుల ఎంపిక విధానం పూర్తిగా పారదర్శకంగా ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకు అనుగుణంగా స్పష్టమైన మార్గదర్శకాలను సిద్ధం చేయాలని కమిటీకి సూచనలు జారీ చేసింది. ఈ నిర్ణయంపై టెలివిజన్ రంగానికి చెందిన నటీనటులు, టెక్నీషియన్లు సానుకూలంగా స్పందిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
also read: అమరావతిలో ప్రెసిషన్ ఆంకాలజీకి శ్రీకారం.. ఆరోగ్య రంగంలో ఏపీ భారీ ముందడుగు
