హైదరాబాద్ నగరంలో ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే కల్తీ మసాలాల గుట్టు రట్టయింది. హెచ్-ఫాస్ట్ పోలీసుల ప్రత్యేక దాడుల్లో భారీ స్థాయిలో నకిలీ మసాలా తయారీ జరుగుతున్నట్టు వెలుగులోకి వచ్చింది. సుమారు 25.3 టన్నుల కల్తీ మసాలాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఒక పౌరుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో మైలార్‌దేవ్‌పల్లి, బాలాపూర్ ప్రాంతాల్లో కల్తీ మసాలాల తయారీ కేంద్రాలను గుర్తించారు. అక్కడ నిర్వహించిన సోదాల్లో వివిధ రకాల మసాలాలను నాసిరకంగా తయారు చేస్తున్నట్టు తేలింది.
ఈ కేసులో రాహుల్ భట్టీ, విశాల్ పన్వర్, దూల్‌చంద్ కచ్చావర్ అనే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి మీద తీవ్రమైన ఆరోపణలతో కేసులు నమోదు చేశారు. ముఖ్యంగా బీఎన్‌ఎస్ సెక్షన్ 110 కింద హత్యాయత్నం కేసులు నమోదు చేయడం గమనార్హం.
విషపూరిత పదార్థాలతో కల్తీ
దాడుల్లో బయటపడిన విషయం ఏమిటంటే, మసాలాలను ఆకర్షణీయంగా కనిపించేలా చేయడానికి టాల్కమ్ పౌడర్, బట్టల రంగులు, సింథటిక్ కెమికల్స్ వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందాలనే ఉద్దేశంతో ఈ మోసాలకు పాల్పడుతున్నట్టు వెల్లడైంది.
మరిన్ని సోదాల్లో భారీ స్వాధీనం
ప్రాథమిక సమాచారంతో పోలీసులు మరో 13 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించారు. అక్కడ తయారీకి సిద్ధంగా ఉన్న సుమారు 89.15 టన్నుల ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కల్తీ మసాలాలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విక్రయిస్తున్నట్టు తెలిసింది.
పోలీసుల హెచ్చరిక
ఆహార పదార్థాల్లో కల్తీ చేసి ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. ఈ తరహా నేరాలకు మూడు నుంచి ఏడు సంవత్సరాల వరకు జైలుశిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపారు.
ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, అనుమానం ఉన్న ఆహార పదార్థాలపై వెంటనే హెచ్-ఫాస్ట్ హెల్ప్‌లైన్ 8712661212కు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.
also read: సంగారెడ్డిలో దారుణం.. భార్యను హత్య చేసి పోలీసులకు లొంగిపోయిన భర్త
