సంగారెడ్డి జిల్లాలో ఘోర ఘటన చోటుచేసుకుంది. నాగల్‌గిద్ద మండలం ఇరాక్‌పల్లి గ్రామంలో కుటుంబ కలహాలు ఒక మహిళ ప్రాణాలను బలితీసుకున్నాయి. భర్త చేతిలోనే భార్య దారుణంగా హత్యకు గురైన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
పోలీసుల వివరాల ప్రకారం, గ్రామానికి చెందిన సయ్యద్ ముల్తాన్ తన భార్య ఇర్ఫానాపై తీవ్ర అనుమానాలతో పాటు కుటుంబ వివాదాల నేపథ్యంలో ఆగ్రహానికి లోనయ్యాడు. ఈ క్రమంలో క్షణికావేశంలో కత్తితో ఆమెపై దాడి చేసి హత్య చేసినట్లు తెలుస్తోంది.
హత్య అనంతరం నిందితుడు మృతదేహాన్ని గ్రామంలోని దర్గాలో పీర్ల సమీపంలో ఉంచి, అక్కడి నుంచి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు సమాచారం. ఈ చర్యతో గ్రామస్తులు షాక్‌కు గురయ్యారు.
ఇర్ఫానా గత ఆరు నెలలుగా తన పుట్టింట్లో ఉంటూ, వారం రోజుల క్రితమే భర్త వద్దకు తిరిగి వచ్చినట్లు తెలిసింది. అయితే తిరిగి వచ్చిన తర్వాత కూడా కుటుంబంలో తలెత్తిన విభేదాలు తీవ్రరూపం దాల్చినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల పూర్తి కారణాలను తెలుసుకునేందుకు విచారణ కొనసాగుతోంది. కుటుంబ కలహాలు, అనుమానాలు ఈ దారుణానికి దారితీశాయని ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు.
also read: రామాయణంలో శూర్పణఖ పాత్ర రకుల్ ప్రీత్ సింగ్ ఎందుకు ఒప్పుకుందో తెలుసా…?
