టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మరో సరికొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నారు. వెండితెరపై తనదైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆయన.. ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో తొలిసారిగా సెలబ్రిటీ టాక్ షోకు హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు. ఈ కార్యక్రమానికి ‘మెగావర్స్’ (Megaverse) అనే ప్రత్యేకమైన పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటీనటులతో చిరంజీవి ముచ్చటించనున్న ఈ షోపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌ను నవంబర్ 30, 2026న హైదరాబాద్‌లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. నెట్‌ఫ్లిక్స్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ వేడుకకు టాలీవుడ్ ప్రముఖులు, మెగా అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది. మరోవైపు హైదరాబాద్‌లో ‘CHIRA_JEEVI’ పేరుతో భారీ హోర్డింగులు ఏర్పాటు చేయడం కూడా ఈ కార్యక్రమంపై చర్చకు దారితీసింది.
ఇప్పటికే ఈ టాక్ షోకు సంబంధించి కొన్ని ఎపిసోడ్ల చిత్రీకరణ పూర్తయినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. త్వరలోనే తొలి ప్రోమోను విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు, ప్రసార తేదీపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.
ఇక ‘మెగావర్స్’లో సందడి చేయబోయే అతిథుల విషయంలోనూ ఆసక్తికరమైన పేర్లు వినిపిస్తున్నాయి. కమల్ హాసన్, నాగార్జున, ప్రభాస్, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, రవితేజ, నాని వంటి స్టార్ హీరోలతో పాటు బ్రహ్మానందం, సత్య తదితరులు ఈ షోలో పాల్గొనే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ జాబితాపై నెట్‌ఫ్లిక్స్ లేదా షో నిర్వాహకులు ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.
గతంలో టెలివిజన్ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించి తన మాటతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిరంజీవి.. ఇప్పుడు ఓటీటీ వేదికపై ఎలాంటి సందడి చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఒకే వేదికపై పలువురు స్టార్ సెలబ్రిటీలతో ఆయన జరిపే సంభాషణలు, సినీ విశేషాలు, సరదా ముచ్చట్లు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు. ‘మెగావర్స్’కు సంబంధించిన అధికారిక ప్రకటన, ప్రోమో కోసం మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు.
also read: ఖమ్మంలో విషాదం.. ఎత్తు పెరగడం లేదనే ఆవేదనతో డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
