ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జయంతి వేడుకల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. నవంబర్ 23న నిర్వహిస్తున్న సత్యసాయి బాబా జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా సత్యసాయి బాబా అందించిన సేవలను మంత్రి గుర్తుచేసుకున్నారు. ఆధ్యాత్మిక రంగంలోనే కాకుండా విద్య, వైద్యం, తాగునీటి సదుపాయాల కల్పన వంటి అనేక సామాజిక కార్యక్రమాల ద్వారా ఆయన సమాజంపై చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయడంలోనూ సత్యసాయి బాబా కీలక పాత్ర పోషించారని కొనియాడారు.
విద్యాసంస్థలు, ఆసుపత్రుల ఏర్పాటు ద్వారా లక్షలాది మందికి సేవలందించడంతో పాటు, తాగునీటి పథకాల ద్వారా ప్రజల అవసరాలను తీర్చేందుకు ఆయన విశేష కృషి చేశారని లోకేశ్ తెలిపారు. మానవ సేవే మాధవ సేవ అనే సందేశంతో ఆయన సాగించిన సేవా ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని అభిప్రాయపడ్డారు.
సత్యసాయి బాబా బోధనలు, సేవా కార్యక్రమాల విశిష్టతను భావితరాలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా సత్యసాయి బాబా చూపిన సేవా మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
also read: ఓటీటీలో మెగాస్టార్ కొత్త అవతారం.. ‘మెగావర్స్’తో టాక్ షోకు చిరంజీవి శ్రీకారం!
