హైదరాబాద్‌లో గోల్డ్ మ్యాన్‌గా గుర్తింపు పొందిన యాదగిరి చిన్న గౌడ్ అలియాస్ దర్గా చిన్న పహిల్వాన్‌కు ఆదాయపు పన్ను శాఖ నుంచి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు సంబంధం ఉన్నట్లు భావిస్తున్న భారీ అపార్ట్మెంట్ భవనాన్ని ఐటీ శాఖ బినామీ ఆస్తుల నిరోధక విభాగం తాత్కాలికంగా అటాచ్ చేసింది. రాయదుర్గంలో ఉన్న ఈ భవనం బావమరిది ప్రణయ్ గౌడ్ పేరు మీద రిజిస్టర్ అయి ఉన్నప్పటికీ, దాని వెనుక అసలు పెట్టుబడిదారుడు చిన్న గౌడేనని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.
ప్రణయ్ పేరు మీద ఆస్తి.. పెట్టుబడి చిన్న గౌడుదే?
ఐటీ శాఖ విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం.. శేరిలింగంపల్లి పరిధిలోని రాయదుర్గంలో 222 చదరపు గజాల స్థలాన్ని 2019 జూలైలో కొనుగోలు చేశారు. రిజిస్ట్రేషన్ పత్రాల్లో ఈ స్థలం విలువను రూ.26.70 లక్షలుగా పేర్కొన్నారు. అయితే స్థలం కొనుగోలుకు అవసరమైన మొత్తాన్ని తన బావ చిన్న గౌడే ఇచ్చినట్లు ప్రణయ్ గౌడ్ విచారణ సందర్భంగా వెల్లడించినట్లు సమాచారం.
ఆ సమయంలో తాను విద్యార్థినని, ఎలాంటి ఆదాయ వనరులు లేవని ప్రణయ్ తెలిపినట్లు అధికారులు గుర్తించారు. అనంతరం ఆ స్థలంలో గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు ఐదు అంతస్తుల అపార్ట్మెంట్ నిర్మించారు. భవన నిర్మాణానికి అవసరమైన నిధులను కూడా చిన్న గౌడే సమకూర్చినట్లు ప్రణయ్ తన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి.
నెలకు రూ.3.20 లక్షల అద్దె ఆదాయం
ఈ అపార్ట్మెంట్ ద్వారా ప్రతి నెలా సుమారు రూ.3.20 లక్షల అద్దె ఆదాయం వస్తున్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు. అయితే ఈ మొత్తాలు నేరుగా ప్రణయ్ బ్యాంకు ఖాతాలోకి వెళ్లకుండా, చిన్న గౌడ్ భార్య ఖాతాకు చేరుతున్నట్లు విచారణలో బయటపడింది. అక్కడి నుంచి చిన్న గౌడ్‌కు చెందిన బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ అయినట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం.
ఈ లావాదేవీల ఆధారంగా ప్రణయ్ గౌడ్‌ను బినామీదారుడిగా, చిన్న గౌడ్‌ను ఆస్తికి అసలు లబ్ధిదారుడిగా పేర్కొంటూ ఐటీ శాఖ జాయింట్ కమిషనర్ నవంబర్ 17న తాత్కాలిక అటాచ్మెంట్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆస్తి అమ్మకాలు, బదిలీలపై నిషేధం
బినామీ లావాదేవీల నిషేధ చట్టం-1988 ప్రకారం ఈ చర్యలు చేపట్టారు. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు అపార్ట్‌మెంట్‌ను విక్రయించడం, ఇతరులకు బదిలీ చేయడం లేదా దానిపై హక్కులు కల్పించడం సాధ్యం కాదు. అంతేకాకుండా భవనం ద్వారా వస్తున్న అద్దె ఆదాయంపైనా అధికారులు ఆంక్షలు విధించారు.
900 గ్రాముల బంగారంపై గతంలో సోదాలు
చిన్న గౌడ్ వ్యవహారం ఐటీ శాఖ దృష్టికి రావడానికి ఆయన గతంలో పలు యూట్యూబ్ ఛానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలు కూడా ఒక కారణంగా మారినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఏప్రిల్‌లో ఆయనకు సంబంధించిన ప్రదేశాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో ఆయన వద్ద ఉన్న 900 గ్రాముల బంగారంలో 700 గ్రాములకు సరైన ఆదాయ ఆధారాలు చూపలేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
మరోవైపు, తన ఆదాయపు పన్ను రిటర్నుల్లో కేవలం రూ.4 లక్షల ఆదాయాన్ని మాత్రమే చూపిన వ్యక్తి వద్ద భారీగా ఆస్తులు ఎలా సమకూరాయనే అంశంపై అధికారులు దృష్టి సారించారు. తాజాగా రాయదుర్గంలోని అపార్ట్‌మెంట్‌ను బినామీ ఆస్తిగా గుర్తించి అటాచ్ చేయడం ఈ వ్యవహారంలో కీలక పరిణామంగా మారింది. తదుపరి దర్యాప్తులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
also read: దక్షిణాది సినిమాల్లో అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నా.. తాప్సీ సంచలన వ్యాఖ్యలు!
