-
పిఆర్పి ప్రధాన కార్యదర్శిగా అలేఖ్య
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో:వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ నేత విజయసాయిరెడ్డి పరివర్తన రాజనీతి పార్టీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ పార్టీలో అనూహ్యంగా నందమూరి కుటుంబానికి చెందిన మహిళ చేరారు. తారకరత్న భార్య అలేఖ్య ఆ పార్టీలో చేరగా.. ఆమెకు కీలక పదవి దక్కింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన విజయసాయిరెడ్డి కొద్ది రోజుల కిందట పరివర్తన రాజనీతి పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పార్టీ పేరుతో ఇప్పటికే ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ అయి ఉందని.. అందుకే పరివర్తన రాజనీతి పార్టీ రిజిస్ట్రేషన్ రద్దు చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీనిపై విజయసాయిరెడ్డి ఫుల్ క్లారిటీ ఇచ్చారు.. ఈ వాదనతో ప్రజలను తప్పుదోవ పట్టించి.. పార్టీలో చేరికలను నియంత్రించేందుకు ఎత్తుగడ అంటూ చెప్పుకొచ్చారు విజయసాయిరెడ్డి. తమ పార్టీ రిజిస్ట్రేషన్ సక్రమంగానే జరిగిందని.. రాజ్యాంగం చట్టం వర్తించే అన్ని నిబంధనలకు అనుగుణంగా పనిచేయడానికి కట్టుబడి ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు విజయసాయిరెడ్డి. మరోవైపు నందమూరి అలేఖ్య పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారని తెలిపారు. దక్షిణామూర్తి కోశాధికారిగా ఈ కమిటీలో కొనసాగుతున్నారని వివరించే ప్రయత్నం చేశారు.
గుండెపోటుతో భర్త మృతి…
నందమూరి తారకరత్న గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. సినిమా రంగంలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన ఆయన రాజకీయాల వైపు ఆసక్తి చూపారు. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభ సమయంలో తారకరత్న గుండెపోటుకు గురయ్యారు. చాలా రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనకు భార్య అలేఖ్య, ముగ్గురు పిల్లలు సైతం ఉన్నారు. ఆమె విజయసాయిరెడ్డి సమీప బంధువు. ఆయన భార్య చెల్లెలు కుమార్తె. వరుసకు విజయసాయిరెడ్డి బాబాయి అవుతారు. తారకరత్న మృతి సమయంలో ఆ కుటుంబానికి ఎంతగానో అండగా నిలిచారు. అదే సమయంలో చంద్రబాబుతో పాటు బాలకృష్ణతో అత్యంత ఆత్మీయంగా కనిపించేవారు.
రాజకీయాలపై ఆసక్తి…
తారకరత్న మృతి చెందిన కొద్దికాలం తర్వాత అలేఖ్య కీలక ప్రకటన చేశారు. తనకు రాజకీయాల్లోకి ఉందని ఆసక్తి కనబరిచారు. దీంతో అంతా ఆమె తెలుగుదేశం పార్టీలో చేరుతారని భావించారు. కానీ ఇప్పుడు విజయసాయిరెడ్డి పిఆర్పి లో ప్రధాన కార్యదర్శి పదవిలో ఆమె నియమితులు కావడం గమనార్హం. విజయసాయిరెడ్డి పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని ఊహాగానాలు వచ్చాయి. కానీ ఆశించిన స్థాయిలో చేరికలు పెరగలేదు. అందుకే ఆయన పునరాలోచనలో పడ్డారు. నందమూరి కుటుంబ మహిళకు ఏకంగా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెట్టారు.
