Homeతెలంగాణమస్కట్‌లో చిక్కుకున్న తెలంగాణ మహిళకు విముక్తి.. కేటీఆర్ చొరవతో సురక్షితంగా స్వదేశానికి!

మస్కట్‌లో చిక్కుకున్న తెలంగాణ మహిళకు విముక్తి.. కేటీఆర్ చొరవతో సురక్షితంగా స్వదేశానికి!

ఉపాధి కోసం విదేశాలకు వెళ్లి మోసానికి గురై మస్కట్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలంగాణ మహిళకు ఎట్టకేలకు విముక్తి లభించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవతో బాధితురాలు తుప్పుడు లక్ష్మి సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

  • ఏజెంట్ మాటలు నమ్మి మస్కట్‌కు..

వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని గోకఫస్లాబాద్ గ్రామానికి చెందిన తుప్పుడు లక్ష్మి ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉపాధి కోసం మస్కట్‌కు వెళ్లారు. అయితే అక్కడికి చేరుకున్న తర్వాత ఏజెంట్ హామీ ఇచ్చిన పని కాకుండా మరో పని అప్పగించారు. అంతేకాకుండా అక్కడి యజమాని ఆమె పాస్‌పోర్టును తన వద్దే ఉంచుకుని, తిరిగి స్వదేశానికి వెళ్లేందుకు అనుమతించలేదు. లక్ష్మిని భారత్‌కు పంపించాలంటే రూ.2 లక్షలు చెల్లించాలని ఏజెంట్ డిమాండ్ చేయడంతో ఆమె కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైంది.

  • కేటీఆర్‌ను ఆశ్రయించిన కుమారుడు

తన తల్లి ఎదుర్కొంటున్న పరిస్థితిని చూసి ఆందోళన చెందిన ఆమె కుమారుడు రాజు సెప్టెంబర్ 29న కేటీఆర్‌ను కలిసి సమస్యను వివరించారు. ఈ విషయంపై స్పందించిన కేటీఆర్.. నెల రోజుల్లో లక్ష్మిని సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

అనంతరం సంబంధిత అధికారులతో మాట్లాడి ఆమెను భారత్‌కు తీసుకొచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయించారు. ఈ క్రమంలో నవంబర్ 2న లక్ష్మి హైదరాబాద్‌కు క్షేమంగా చేరుకున్నారు.

  • భావోద్వేగానికి గురైన లక్ష్మి

తిరిగి స్వగ్రామానికి చేరుకున్న లక్ష్మి కేటీఆర్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తన కుమారుడికి ఇచ్చిన మాట ప్రకారం నెల రోజుల్లోనే తనను స్వదేశానికి రప్పించారని భావోద్వేగానికి గురయ్యారు. తన కుటుంబం కష్టకాలంలో అండగా నిలిచిన కేటీఆర్ సహాయాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటామని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గానికి చెందిన మహిళకు కేటీఆర్ సహాయం చేయడం రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.

also read: మేడిగడ్డ నీటిని ఎందుకు ఎత్తిపోయడం లేదు? కాంగ్రెస్‌పై వేముల ప్రశాంత్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు