క్రైమ్ మిర్రర్ : శుద్ధీకరణ పేరుతో ఓ మహిళపై ఏడుగురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు రావడం గుజరాత్లో కలకలం రేపింది. సురేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ఇద్దరు మహిళలు సహా మొత్తం తొమ్మిది మందిని నిందితులుగా పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత మహిళకు గతంలోనే వివాహం జరిగింది. అయితే ఆమెను మరో వ్యక్తి వివాహం చేసుకున్నప్పటికీ, అతనికి అప్పటికే భార్య ఉన్నట్లు సమాచారం. అనంతరం సదరు మహిళను తన వద్దే ఉంచుకుని బయటకు వెళ్లకుండా నిర్బంధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్థితుల మధ్య బాధితురాలు మరో వ్యక్తితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న ఆమె బంధువులు ఆమెను వెతికి పట్టుకుని తిరిగి తీసుకొచ్చారు. అనంతరం ఆమెను చెట్టుకు కట్టేసి దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
‘శుద్ధీకరణ’ పేరుతో దారుణం
అనంతరం మహిళపై ‘శుద్ధీకరణ కార్యక్రమం’ నిర్వహించాలంటూ ఏడుగురు వ్యక్తులు ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనకు సంబంధించి బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న పోలీసులు.. ఫిర్యాదులో పేర్కొన్న అంశాల ఆధారంగా కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై సురేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కేసులో మొత్తం తొమ్మిది మందిపై చర్యలు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.
గ్రామంలో ఉన్న ఆచారమే కారణమంటూ..
బాధితురాలు వివాహేతర సంబంధం పెట్టుకున్నా లేదా భర్తను విడిచి మరో వ్యక్తితో వెళ్లిపోయినా.. ఆమెకు ‘ప్రక్షాళన’ చేయడం తమ గ్రామంలో కొనసాగుతున్న కులాచారంగా కొందరు భావిస్తారని స్థానికంగా ఓ వ్యక్తి పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఇలాంటి ఆచారం పేరుతో మహిళపై హింసకు పాల్పడటం, ఆమెను నిర్బంధించడం, లైంగిక దాడికి పాల్పడటం చట్టవిరుద్ధమేనని అధికారులు స్పష్టం చేశారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై ఏఎస్పీ వేదికా బిహానీ స్పందిస్తూ.. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కేసులోని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
also read : బాలీవుడ్లో విషాదం.. ప్రముఖ నటుడు నానా పటేకర్ కన్నుమూత
