బెంగళూరులో ఉదయం వేళ విద్యుత్ పరికరం పేలిపోవడంతో ఒక్కసారిగా తీవ్ర భయాందోళన నెలకొంది. బాగలూరు క్రాస్ సమీపంలోని అమెజాన్ కార్యాలయం వద్ద ఉన్న విద్యుత్ రింగ్ మెయిన్ యూనిట్ (RMU) అకస్మాత్తుగా పేలింది. ఈ ఘటనలో ఫుట్‌పాత్‌పై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తి గాయపడ్డాడు.
ఉదయం సుమారు 9:30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మహమ్మద్ అఫ్రోజ్ అనే వ్యక్తి ఫుట్‌పాత్‌పై వెళ్తుండగా సమీపంలోని విద్యుత్ రింగ్ మెయిన్ యూనిట్ భారీ శబ్దంతో పేలింది. పేలుడు ధాటికి అతడు కిందపడిపోయి గాయాలపాలయ్యాడు.
ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి అఫ్రోజ్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందని, ఎలాంటి ప్రాణాపాయం లేదని అధికారులు వెల్లడించారు.
ఈ ఘటన యలహంక ఓల్డ్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పేలుడు కారణంగా కొద్దిసేపు ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం నెలకొంది. భయంతో స్థానికులు, అక్కడి నుంచి వెళ్తున్న ప్రజలు పరుగులు తీశారు.
కాగా, ఘటనపై బెంగళూరు విద్యుత్ సరఫరా కంపెనీ (BESCOM) అధికారులు స్పందించారు. మీడియం వోల్టేజ్ విద్యుత్ పంపిణీ వ్యవస్థలో ఉపయోగించే రింగ్ మెయిన్ యూనిట్‌లో సాంకేతిక సమస్య తలెత్తడం వల్లే పేలుడు సంభవించి ఉండొచ్చని ప్రాథమికంగా తెలిపారు. ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయని పేర్కొన్నారు.
సమాచారం అందుకున్న వెంటనే బెస్కాం సాంకేతిక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. విద్యుత్ వ్యవస్థను తనిఖీ చేస్తూ తదుపరి చర్యలు చేపట్టారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై అధికారులు మరింత పరిశీలన కొనసాగిస్తున్నారు.
also read: తిరుమల శ్రీవారి సన్నిధిలో తమన్నా.. ‘ఈరోజు దర్శనం ఎంతో ప్రత్యేకం’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు
