మాజీ డీఎస్పీ భీమ్‌రెడ్డికి సంబంధించిన అక్రమాస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ (ACB) దర్యాప్తును ముమ్మరం చేసింది. హైదరాబాద్, జహీరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. మొత్తం 10 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ క్రమంలో అనుమానిత బినామీలకు సంబంధించిన నివాసాల్లోనూ ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. సోదాల్లో భారీగా నగదు, విదేశీ కరెన్సీతో పాటు ఇతర విలువైన వస్తువులు బయటపడినట్లు సమాచారం. బొమ్మ వెంకటేశ్ నివాసంలో నిర్వహించిన తనిఖీల్లో రూ.1.35 కోట్ల నగదును ఏసీబీ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
అదే ఇంట్లో విదేశీ కరెన్సీతో పాటు 14 లీటర్ల విదేశీ మద్యం కూడా లభించినట్లు ఏసీబీ వెల్లడించింది. కేసుకు సంబంధించిన పలు కీలక పత్రాలను సైతం అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ డాక్యుమెంట్లు, నగదు తదితర అంశాల ఆధారంగా భీమ్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
సోదాల్లో లభించిన నగదు, విదేశీ కరెన్సీ, పత్రాల మూలాలు, వాటికి మాజీ డీఎస్పీ భీమ్‌రెడ్డితో ఉన్న సంబంధాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత కేసులో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
also read: కుక్క కాటును నిర్లక్ష్యం చేయడంతో విషాదం.. రెండేళ్ల చిన్నారి మృతి
