కుక్క కాటును నిర్లక్ష్యం చేయడం ఓ చిన్నారి ప్రాణాలను బలిగొంది. పల్నాడు జిల్లా ఈపూరు మండలం బొగ్గరం గ్రామానికి చెందిన రెండేళ్ల రుద్రాన్స్ అనే బాలుడిని సుమారు 15 రోజుల క్రితం ఓ కుక్క కరిచింది. అయితే కుక్క కాటు పెద్ద ప్రమాదం కాదని భావించి కుటుంబ సభ్యులు వెంటనే వైద్య చికిత్స తీసుకోలేదని సమాచారం.
సకాలంలో రేబిస్ వ్యాక్సిన్ తీసుకోకపోవడంతో కొద్దిరోజుల తర్వాత చిన్నారిలో రేబిస్‌కు సంబంధించిన లక్షణాలు కనిపించినట్లు తెలుస్తోంది. దీంతో కుటుంబ సభ్యులు బాలుడిని నరసరావుపేట, అనంతరం గుంటూరులోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించారు. పరిస్థితి క్రమంగా విషమించడంతో వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు రుద్రాన్స్ మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.
కుక్క కాటు చిన్న విషయంగా భావించి నిర్లక్ష్యం చేయవద్దని వైద్యులు సూచిస్తున్నారు. కుక్క లేదా ఇతర జంతువులు కరిచిన వెంటనే గాయాన్ని శుభ్రంగా కడిగి, ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు. వైద్యుల సూచన మేరకు రేబిస్ వ్యాక్సిన్, అవసరమైన ఇతర చికిత్సను సకాలంలో తీసుకోవాలని సూచిస్తున్నారు.
also read: ఖమ్మంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో 9 నెలల పసికందు మృతి
