ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఆయన వ్యక్తిత్వంలోని మానవీయ కోణాన్ని పరిచయం చేసే కొత్త పుస్తకం పాఠకుల ముందుకు రానుంది. ‘మోదీ కథ’ పేరుతో రూపొందిన ఈ పుస్తకం సెప్టెంబర్ 17న ఢిల్లీలో విడుదల కానుంది. ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ (IGNCA)లో నిర్వహించే కార్యక్రమంలో కేంద్ర న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు.
ప్రముఖ జర్నలిస్ట్, రచయిత హరీశ్ చంద్ర బర్నవాల్ ఈ పుస్తకాన్ని రచించారు. గత 25 ఏళ్లలో మోదీ జీవితంలో చోటుచేసుకున్న పలు సంఘటనలను ఆధారంగా చేసుకుని ఆయనలోని కరుణ, ఆప్యాయత, సున్నితత్వాన్ని ప్రతిబింబించే 10 వాస్తవ ఘటనలను ఇందులో కథల రూపంలో వివరించారు. సులభంగా అర్థమయ్యే భాషలో భావోద్వేగపూరిత కథన శైలితో పుస్తకాన్ని రూపొందించినట్లు ప్రచురణకర్తలు వెల్లడించారు.
యువ నాయకుడిగా ఉన్న సమయంలో 1990లో మోదీ చేసిన ఓ రైలు ప్రయాణానికి సంబంధించిన ఘటనను కూడా ఇందులో ప్రస్తావించారు. ఆ సమయంలో ఇద్దరు మహిళా ప్రయాణికులకు రాజకీయ నాయకులపై ఉన్న అభిప్రాయం మారడానికి కారణమైన సంఘటనను రచయిత వివరించారు. అలాగే నేపాల్‌కు చెందిన జీత్ బహదూర్ అనే బాలుడిని మోదీ తన కార్యకర్తగా చేరదీసిన తీరు, అనంతరం ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా అతడిని గుర్తుంచుకుని ఆప్యాయంగా పలకరించిన సందర్భాన్ని పుస్తకంలో పొందుపరిచారు.
దృష్టిలోపం ఉన్న పింకల్ అనే విద్యార్థి విషయంలో మోదీ చూపిన ప్రత్యేక శ్రద్ధ, ఆ అంశం కేంద్ర బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులకు దారితీసిన విధానాన్ని కూడా ఇందులో వివరించారు. అదేవిధంగా ఆగ్రాకు చెందిన తైబా అనే బాలిక ప్రాణాలను కాపాడేందుకు సకాలంలో సహాయం అందించిన ఘటనతో పాటు, కర్ణాటకలోని హుబ్బళ్లికి చెందిన కార్మికుడు చంద్రకాంత్ వంటి సామాన్య ప్రజల జీవితాల్లో చోటుచేసుకున్న కష్టసుఖాల పట్ల మోదీ స్పందించిన తీరును పుస్తకంలో ప్రస్తావించారు.
ప్రభుత్వ పాలన అనేది కేవలం విధానాలు, అధికారిక దస్త్రాలకే పరిమితం కాదని.. సమాజంలోని సామాన్యులు, ముఖ్యంగా అట్టడుగు వర్గాల ప్రజల భావాలను అర్థం చేసుకోవడంలోనూ నిజమైన పాలన ఉందనే సందేశాన్ని ఈ కథల ద్వారా అందించడమే పుస్తక ఉద్దేశమని ప్రచురణకర్తలు తెలిపారు.
మోదీపై హరీశ్ చంద్ర బర్నవాల్ రచించిన ఐదో పుస్తకం ‘మోదీ కథ’. ప్రభాత్ ప్రకాశన్ దీనిని ప్రచురించింది. ఈ పుస్తకంలోని ప్రతి కథకు సంబంధించిన వాస్తవాలను నిర్ధారించేందుకు ఉపయోగించిన మూలాలను కూడా చివర్లో పేర్కొనడం ప్రత్యేకతగా ప్రచురణకర్తలు తెలిపారు. బర్నవాల్ గతంలో ‘మోదీ సూత్ర’, ‘మోదీ నీతి’, ‘లార్డ్ ఆఫ్ రికార్డ్స్’ తదితర పుస్తకాలను రచించారు. కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్ఠాత్మక ‘భరతేందు హరిశ్చంద్ర’ అవార్డును కూడా ఆయన అందుకున్నారు.
also read: దుస్తులపై ట్రోలింగ్.. ఐశ్వర్య లక్ష్మి ఘాటు స్పందన
