ఢిల్లీ శివారు ప్రాంతంలో జరిగిన దాడి ఘటన తీవ్ర విషాదానికి దారితీసింది. ప్రముఖ గిటార్ కళాకారుడు చోంగ్తమ్ విక్రమ్ సింగ్ (55)పై కొందరు వ్యక్తులు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఆయన కన్నుమూశారు.
ఆదివారం రాత్రి విక్రమ్ సింగ్ నివాసం సమీపంలో కొందరు వ్యక్తులు మద్యం మత్తులో హంగామా చేస్తున్నట్లు సమాచారం. ఇంటి ముందు జరుగుతున్న గొడవను అడ్డుకునేందుకు విక్రమ్ బయటకు వెళ్లిన సమయంలో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.
ఈ క్రమంలో సుమారు ఎనిమిది మంది వ్యక్తులు ఆయనపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. దాడిలో తీవ్రంగా గాయపడిన విక్రమ్‌ను కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించడంతో సోమవారం ఆయన మృతి చెందారు.
మణిపూర్‌లోని ఇంపాల్‌కు చెందిన విక్రమ్ సింగ్ కొంతకాలంగా ఢిల్లీలో నివసిస్తున్నారు. సంగీతంపై ఉన్న ఆసక్తితో అక్కడే మ్యూజిక్ స్కూల్ నిర్వహిస్తూ పలువురు విద్యార్థులకు గిటార్లో శిక్షణ అందించేవారు. కళాకారుడిగా మాత్రమే కాకుండా సంగీత ఉపాధ్యాయుడిగా కూడా ఆయనకు మంచి గుర్తింపు ఉన్నట్లు తెలుస్తోంది.
విక్రమ్ సింగ్ మృతితో ఆయన కుటుంబ సభ్యులు, విద్యార్థులు, సంగీత రంగానికి చెందినవారు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి దాడికి పాల్పడిన వ్యక్తుల వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం.
also read: అభివృద్దితోనే ప్రజల్లోకి వెళ్లగలం…సీఎం చంద్రబాబు…
