దేశవ్యాప్తంగా రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలు సామాన్య, మధ్యతరగతి ప్రజల నడ్డివిరుస్తున్నాయి. కిచెన్‌లోకి వెళ్లాలంటేనే భయపడాల్సిన వాతావరణం నెలకొంది. బియ్యం, చక్కెర, పప్పు ధాన్యాలు, వంట నూనెలు ఇలా ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ధరలు అమాంతం దూసుకెళ్తున్నాయి. నెలవారీ బడ్జెట్ తలకిందులవుతుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రధానంగా, రెండు నెలల క్రితం వరకు కిలో నాణ్యమైన బియ్యం రూ.45 నుంచి రూ.50 మధ్య ఉండగా, ప్రస్తుతం అది కాస్తా రూ.70కి చేరింది. ఇక సామాన్యులు నిత్యం వాడే చక్కెర ధర రూ.45 నుంచి ఏకంగా రూ.60 – రూ.70 వరకు ఎగబాకింది. మరోవైపు కందిపప్పు, పెసరపప్పు వంటి పప్పు ధాన్యాల ధరలు కిలోపై సుమారు రూ.20 వరకు పెరిగాయి. కూరగాయలు, కిరాణా సరుకులతో పాటు వంటనూనె ధరలు లీటరుకు రూ.20 వరకు అధికం కావడంతో ఇళ్ల నిర్వహణ భారంగా మారిందని గృహిణులు వాపోతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిస్థితులు, వర్షాభావం, పంట దిగుబడులు తగ్గడం వంటి కారణాల వల్లనే ఈ ధరల పెరుగుదల చోటుచేసుకుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించి, పేద, సామాన్య ప్రజలను ఆదుకోవాలని ప్రభుత్వాలను ప్రజలు కోరుతున్నారు.
ఏపీలో వినాయక చవితి వేడుకలకు గుడ్‌న్యూస్: గణేష్ మండపాలకు ఆన్‌లైన్‌లోనే సింగిల్ విండో అనుమతులు!
