క్రైమ్ మిర్రర్ : హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో మిస్టరీగా మారిన నేపాలీ వంట మాస్టర్ మృతి కేసును పోలీసులు ఛేదించారు. సెల్‌ఫోన్ కోసం దుండగులు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి మృతి చెందినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసుకు సంబంధించి ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరు మైనర్ ఉన్నట్లు అధికారులు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం.. నేపాల్‌కు చెందిన నాగేంద్ర మాఝీ అత్తాపూర్‌లోని ఓ హోటల్‌లో వంట మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. ఆగస్టు 24న రాత్రి సుమారు 11 గంటల సమయంలో సిగరెట్ తాగి వస్తానని భార్య చంద్రబుధకు చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అయితే చాలాసేపటికీ తిరిగి రాకపోవడంతో ఆమె ఆందోళనకు గురై భర్త కోసం వెతకడం ప్రారంభించింది.
ఈ క్రమంలో అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ప్రణవ్ విల్లాస్ సమీపంలో నాగేంద్ర మాఝీ తీవ్ర గాయాలతో పడి ఉండటాన్ని ఆమె గుర్తించింది. అప్పటికే అతడు మృతి చెందినట్లు తెలుస్తోంది. దీంతో ఘటనపై ఆమె రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కేసును సీరియస్‌గా తీసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు, శంషాబాద్ టాస్క్‌ఫోర్స్ సిబ్బందితో కలిసి దర్యాప్తు చేపట్టారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించడంతో పాటు సాంకేతిక ఆధారాలను సేకరించారు. దర్యాప్తులో నాగేంద్ర మాఝీ వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను దోచుకునే క్రమంలోనే దాడి జరిగినట్లు పోలీసులు గుర్తించారు.
రాజేంద్రనగర్‌కు చెందిన మహ్మద్ సుఫియాన్ మరో మైనర్‌తో కలిసి నాగేంద్ర మాఝీపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. సిగరెట్ తాగుతున్న సమయంలో అతడిని అడ్డగించి సెల్‌ఫోన్ లాక్కున్నారని, అనంతరం తీవ్రంగా కొట్టడంతో నాగేంద్ర మాఝీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు దర్యాప్తులో తేలింది. కేసు దర్యాప్తులో భాగంగా నిందితులను గుర్తించిన పోలీసులు గురువారం ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై గతంలోనూ క్రిమినల్ కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి తదుపరి చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.
also read : నేపాల్ వరదల్లో ఎల్బీనగర్ యువతి గల్లంతు..
