జపాన్లో వరుస భూకంపాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా తూర్పు జపాన్లో తెల్లవారుజామున 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని ప్రకంపనలు రాజధాని టోక్యోతో పాటు పరిసర ప్రాంతాల్లోనూ స్పష్టంగా కనిపించాయి. భవనాలు ఒక్కసారిగా ఊగిపోవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే ఎలాంటి సునామీ హెచ్చరిక జారీ చేయకపోవడంతో అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
జపాన్ వాతావరణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. దక్షిణ ఇబరాకి ప్రిఫెక్చర్ పరిసరాలను కేంద్రంగా చేసుకుని ఈ భూకంపం చోటుచేసుకుంది. భూకంప కేంద్రం భూమికి సుమారు 70 నుంచి 78 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. జేఎంఏ 5.9 తీవ్రతగా నమోదు చేయగా.. అమెరికా జియోలాజికల్ సర్వే, జర్మనీకి చెందిన జీఎఫ్జెడ్ సంస్థలు 5.8 తీవ్రతగా పేర్కొన్నాయి.
భూకంప ప్రభావంతో ఇబరాకి, చిబా, సైతామా ప్రాంతాల్లో పలువురికి గాయాలైనట్లు సమాచారం. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రైలు సేవలపైనా ప్రకంపనల ప్రభావం పడింది. టోక్యో-నరిటా విమానాశ్రయం మార్గంలో నడిచే ఎక్స్ప్రెస్ రైళ్లతో పాటు ఈశాన్య ప్రాంతాలకు వెళ్లే కొన్ని లోకల్ రైళ్లు ఆలస్యంగా నడిచాయి.
పరిస్థితిని పర్యవేక్షించేందుకు జపాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రత్యేక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసినట్లు ప్రధాని సనాయ్ తకైచి తెలిపారు. ప్రజలు భయపడకుండా అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.
ఇదిలా ఉండగా.. గత నెలలో క్యుషు ప్రాంతంలోని కుమామోటోలో 7.1 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఆ ఘటనలో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం నమోదైనట్లు సమాచారం. 38 మంది ప్రాణాలు కోల్పోగా, 360 మందికి పైగా గాయపడ్డారు. వేలాది ఇళ్లు దెబ్బతిన్నాయి.
జపాన్ భూకంపాలకు అత్యంత సున్నితమైన ప్రాంతంలో ఉండటంతో తరచూ ప్రకంపనలు సంభవిస్తుంటాయి. తాజా ఘటనతో మరోసారి ప్రజల్లో ఆందోళన నెలకొంది.
also read: హర్మూజ్ జలసంధిపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. అమెరికా భూభాగమేనంటూ మ్యాప్ విడుదల!
